కాన్పూర్ : ర్యాగింగ్ ఆరోపణలపై కాన్పూర్ ఐఐటీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తోటి విద్యార్థులను వేధించారన్న ఆరోపణలపై 22 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఓ ఏడాది నుంచి మూడేళ్ల వరకు అమల్లో ఉంటుంది. సోమవారం సమావేశమైన ఐఐటీ సెనేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి వివరణలు అడిగి తెలుసుకుంది. అనంతరం ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది విద్యార్థులను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మహీంద్ర అగర్వాల్ తెలిపారు.
మరో ఆరుగురు విద్యార్థులు ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉంటారని వివరించారు. వీరి అడ్మిషన్లను రద్దు చేయబోమని, సస్పెన్షన్ కాలం పూర్తయ్యాక వీరు తిరిగి తమ చదువులను తిరిగి కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 19, 20వ తేదీల్లో జూనియర్ స్టూడెంట్స్‌ను కొందరు సీనియర్లు వేధింపులకు గురిచేశారు. దీనిపై పలు ఫిర్యాదులు అందటంతో యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. నివేదిక అందటంతో తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా సస్పెండ్ అయిన విద్యార్థులు బహిష్కరణ కాలంలో క్షమాభిక్ష కోసం విజ్ఞప్తి చేసే హక్కు లేదు.
Comments
Please login to add a commentAdd a comment