
ఈ ఏడాదే రామమందిర నిర్మాణం
ఉనావ్(యూపీ): అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ పాలనలోనే పూర్తిచేస్తామని వివాదాస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ స్పష్టం చేశారు. మందిర నిర్మాణం ఈ రోజు కాకపోతే మరో రోజు పూర్తి చేస్తామన్నారు. తాము ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటామని, ఈ ఏడాదిలో రామమందిర నిర్మాణం చేపడతామని శనివారమిక్కడ అన్నారు.దేశాభివృద్ధితో పాటు కాషాయదళ ప్రధాన ఎజెండా అయినా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడానికే మోదీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిందని విశ్వ హిందూ పరిషత్ నేత సురేంద్రజైన్ అన్నారు. కాగా, మహరాజ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ వివరణివ్వాలని కాంగ్రెస్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు. బీజేపీ పనిచేస్తోంది దేశాభివృద్ధికా? లేక ఆరెస్సెస్ ఎజెండాలకు న్యాయం చేయడానికా? అని ప్రశ్నించారు.