బలగాల ఉపసంహరణ | India and China Are Step Forward To Keep Friendly Relationship | Sakshi
Sakshi News home page

బలగాల ఉపసంహరణ

Published Wed, Jun 24 2020 1:37 AM | Last Updated on Wed, Jun 24 2020 5:08 AM

India and China Are Step Forward To Keep Friendly Relationship - Sakshi

లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్‌తో మాట్లాడుతున్న ఆర్మీ చీఫ్‌ నరవణే

న్యూఢిల్లీ: యుద్ధ మేఘాలు కమ్ముకున్న దశ నుంచి ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనా కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. రెండు దేశాల లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్‌లోని చైనా భూభాగంలో ఉన్న మోల్డా వద్ద సోమవారం దాదాపు 11 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కారప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నాయకత్వం వహించారు. టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ల్యూ లిన్‌ నేతృత్వంలో చైనా బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ‘సానుకూల, సుహృద్భావ, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయి.

తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించేందుకు విధివిధానాలను రూపొందించుకోవాలని, అందుకు మరికొన్ని సార్లు భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది’ అని ఆర్మీ వర్గాలు మంగళవారం తెలిపాయి. గల్వాన్‌ లోయలో భారత జవాన్లపై చైనా సైనికులు ప్రాణాంతక దాడులు చేయడాన్ని ఈ చర్చల సందర్భంగా భారత ప్రతినిధి బృందం గట్టిగా ప్రశ్నించిందని వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ దగ్గర్లోని మిలటరీ కేంద్రాల్లో బలగాల సంఖ్యను రెండు దేశాలు గణనీయంగా తగ్గించుకోవాలని కూడా భారత బృందం సూచించినట్లు పేర్కొన్నాయి. ‘ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా, అన్ని వివాదాస్పద అంశాలపై రెండు దేశాల అధికారులు లోతైన చర్చ జరిపారు. స్పష్టంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు’ అని ఈ చర్చలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో జిన్‌లింగ్‌ స్పందించారు.

రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య జూన్‌ 6వ తేదీని తొలి విడత చర్చలు జరిగాయి. గల్వాన్‌ లోయ నుంచి ప్రారంభించి సరిహద్దుల్లోని అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనికులు క్రమంగా వెనక్కు తొలగాలని ఆ చర్చల్లో నిర్ణయించారు. కానీ, జూన్‌ 15న రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఇరుదేశాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఘర్షణల్లో కల్నల్‌ సహా 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత్‌ ప్రకటించింది. కానీ, చైనా నుంచి అలాంటి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 35 మంది వరకు చైనా సైనికులు చనిపోయారని యూఎస్‌ నిఘా వర్గాలు తెలిపాయి.  చైనా సోషల్‌ మీడియాలోనూ దీనిపై పలు వార్తలు వచ్చాయి. చైనా ఆర్మీ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడా మృతుల్లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.

ఐటీబీపీ బలగాల పెంపు 
చైనాతో ఉద్రిక్తతలు నెలకొనడంతో వాస్తవాధీన రేఖ వెంట బలగాల సంఖ్యను ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ భారీగా పెంచుతోంది. లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లోని సరిహద్దుల్లో ఉన్న వివిధ సైనిక కేంద్రాలకు 4000 మంది సైనికులను పంపించడం ప్రారంభించింది. వారు మంచు పర్వతాల్లో పోరాడే సామర్థ్యమున్న సుశిక్షితులైన సైనికులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న ఆ సైనికులను వెనక్కు పిలిపిస్తున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఉన్న నేపథ్యంలో.. వారందరికీ క్వారంటైన్‌ సౌకర్యం కల్పించాలని ఆయా సైనిక కేంద్రాలను ఆదేశించామన్నారు. పెద్ద ఎత్తున స్నో స్కూటర్లు, ట్రక్కులు ఇతర వాహనాలను కూడా ఎల్‌ఏసీ సమీప కేంద్రాల్లో ఐటీబీపీ మోహరించింది.

సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్‌
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె మంగళవారం తూర్పు లద్దాఖ్‌లో సైనిక బలగాల సన్నద్ధతను పరిశీలించారు. లేహ్‌ చేరుకోగానే మొదట, జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిలో గాయపడిన 18 మంది భారత సైనికులను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ సైనికులను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పరామర్శించి, వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఆ తరువాత, క్షేత్రస్థాయి కమాండర్లతో అక్కడి సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితిని సమీక్షించారు. చైనా ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, తక్షణమే స్పందించేలా అత్యంత అప్రమత్తతతో ఉండాలని వారికి ఆదేశాలిచ్చారు. తూర్పు లద్ధాఖ్‌లోని సరిహద్దు పోస్ట్‌లను నేడు(బుధవారం) ఆయన సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. లేహ్‌లో జనరల్‌ నరవణెకు 14 కారŠప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ సరిహద్దుల్లోని పరిస్థితిని వివరిస్తారని, చైనా బృందంతో జరిపిన చర్చల వివరాలను వెల్లడిస్తారని తెలిపాయి. లేహ్‌కు బయల్దేరే ముందు ఆర్మీ ఉన్నతాధికారుల సదస్సులో జనరల్‌ నరవణె పాల్గొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిని, భారత దళాల సన్నద్ధతను టాప్‌ కమాండర్లు ఆయనకు వివరించారు. గతవారం లద్దాఖ్, శ్రీనగర్‌ల్లోని ఎయిర్‌ బేస్‌లను ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ బధౌరియా సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళ సన్నద్ధతను ఆయన సమీక్షించారు.

అవి ఫేక్‌ న్యూస్‌: చైనా
బీజింగ్‌: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 40 మంది తమ సైనికులు చనిపోయారని వస్తున్న వార్తలు అబద్ధమని చైనా స్పష్టం చేసింది. 40 మందికిపైగా చైనా సైనికులు చనిపోయారని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ చేసిన వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ వద్ద మీడియా ప్రస్తావించింది. దీనిపై లిజియాన్‌ స్పందిస్తూ.. అవన్నీ అబద్ధాలని, మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలని పేర్కొన్నారు. భారత్‌లో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మరణాలపై చైనా అధికారికంగా స్పందించడం ఇదే ప్రథమం.

పాక్‌ కన్నా చైనానే డేంజర్‌
శత్రు దేశాల విషయానికి వస్తే పాక్‌కన్నా చైనానే ప్రమాదకరమని అత్యధిక శాతం భారతీయులు నమ్ముతున్నారు. దేశ రక్షణకు సంబంధించినంతవరకు ప్రధాని మోదీనే సరైన నాయకుడని విశ్వసిస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ‘ఏబీపీ– సీ ఓటర్‌’ చేసిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 68% చైనాతోనే ఎక్కువ ముప్పని అభిప్రాయపడ్డారు. 32% మంది పాక్‌ ఎక్కువ ప్రమాదకారి అన్నారు. దేశం మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉంటుందని 72.6% ప్రజలు తేల్చిచెప్పారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో చైనాకు సరైన బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందా? అన్న ప్రశ్నకు 60% ప్రజలు లేదు అనే జవాబివ్వడం గమనార్హం. 39% మాత్రం సరైన చర్యలు తీసుకుందన్నారు.

ఈ సమస్యపై మోదీ ప్రభుత్వమే సమర్ధవంతంగా వ్యవహరిస్తోందని 73.6% ప్రజలు పేర్కొన్నారు. ప్రస్తుత విపక్షం అధికారంలో ఉంటే మరింత సమర్ధంగా వ్యవహరించేదని 16.7% చెప్పగా, 9.6% మాత్రం అటు ప్రభుత్వానికి కానీ, ఇటు విపక్షానికి కానీ ఈ సమస్యను సరిగ్గా డీల్‌ చేసే సామర్ధ్యం లేదన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం కాదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీపై తమకు నమ్మకం లేదని 61% మంది చెప్పారు. 14.4% మంది మాత్రం దేశ రక్షణ విషయంలో రాహుల్‌పై విశ్వాసం ఉందన్నారు. భారతీయులు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేస్తారని విశ్వసిస్తున్నట్లు 68% మంది చెప్పగా, మేడ్‌ ఇన్‌ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని 31% స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement