
భారీగా దళాలను మోహరించిన భారత్
న్యూఢిల్లీ: భారతదేశానికి ఉన్న సరిహద్దును అత్యధికంగా పంచుకుంటున్న రెండో దేశం చైనా. డొక్లాం సమస్యపై చైనా తరచూ ఘాటు వ్యాఖ్యలకు దిగడంతో పాటు వెనక్కు తగ్గకపోతే ఘోర ప్రభావాన్ని భారత్ చవి చూస్తుందని హెచ్చరిస్తోంది. చైనా వ్యాఖ్యలకు అడపా దడపా భారత్ తరఫు నుంచి మన నాయకులు దీటుగా జవాబిస్తున్నారు.
కానీ అది చైనా దూకుడుకు సరిపోవడం లేదు. అందుకే మాటలతో కాదు చేతలతోనే చైనాకు సమాధానం చెప్పాలని భారత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. డొక్లాంలో భారీగా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిసింది. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుదళానికి కూడా ఆపరేషనల్ అలర్ట్ జారీ అయిందని సమాచారం.
శుక్రవారం భారత్-చైనాల మేజర్ జనరల్ స్ధాయి సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అలర్ట్‌లు జారీ కావడం గమనార్హం. అంటే చైనా తాను వెనక్కు తగ్గకుండా కేవలం నోటిమాటతో తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బెదిరింపులకు చైనా సరిహద్దులో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని భారత్ నమ్ముతోంది. అందుకే ఉన్న పళంగా 3,488 కిలోమీటర్ల సరిహద్దులోని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన అలర్ట్‌లో పేర్కొంది.
అంతేకాదు అత్యవసర పరిస్ధితుల్లో వాయుదళం సేవలను కూడా వినియోగించి ప్రత్యర్థికి ముచ్చెటమలు పట్టించాలని యోచన మన సేనల్లో ప్రస్ఫుటమవుతోంది. సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రం భారత్ నుంచి 350 మంది సైనికులు, చైనా నుంచి 350 మంది సైనికులు ఉన్నారు. యుద్ధ సన్నహకాల్లో భాగంగా సరిహద్దులోని గ్రామాలను భారత సైన్యం ఖాళీ చేయిస్తోందంటూ వచ్చిన వార్తలను భారతీయ ఆర్మీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, డొక్లాం పీఠభూమికి 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తే మంచిదని భారత సైన్యం సూచన చేసినట్లు తెలిసింది.