సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశం ఆది నుంచి ప్రజారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం అంతకష్టమయ్యేది కాదు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.28 శాతం కేటాయింపులు జరపగా, 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.5 శాతం, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.6 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. మన పొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మనకన్నా ఎక్కువ నిధులను కేటాయిస్తున్నాయి.
దేశంలో ప్రజారోగ్యానికి కనీసం జీడీపీలో మూడు శాతం నిధులనైనా కేటాయించాలని ప్రజారోగ్య విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2006లో ‘నైన్ ఈజ్ మైన్’ అనే నినాదంతో పాటశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం, వైద్య రంగానికి మూడు శాతం నిధులను కేటాయించాలన్నది నాడు విద్యార్ధుల డిమాండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రతీ ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనే చెబుతూ వచ్చాయి. పలు పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. కానీ అవి ఎప్పుడు మాట నిలబెట్టుకోలేక పోయాయి. దేశంలో ఆరోగ్యం జాతీయ లేదా ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్రాల జాబితాలో ఉండడం, ఆరోగ్యం పౌరలు ప్రాథమిక హక్కు కాకపోవడం ప్రతికూల అంశాలే. 2022లో వచ్చే 75వ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్య రంగాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడమే కాకుండా, ఈ రంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని ఆరోగ్య రంగంపై 15వ ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక్కరు చొప్పున ఆలోపతి వైద్యుడు ఉండాలి. భారత్‌లో రిజిస్టర్డ్ ఆలోపతి వైద్యులు 11,54,686 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వాస్పత్రుల్లో 1,16,756 మంది పని చేస్తున్నారు. ప్రతి 10,926 మందికి ఒకరు చొప్పున వైద్యులు ఉన్నారంటే వైద్యుల కొరత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం భారత్‌లో క్రిటికల్ కేర్ నిపుణులు 50 వేల మంది అవసరం కాగా, 8,350 మంది మాత్రమే ఉన్నారు. దేశంలో నేడు కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగిన ల్యాబ్‌లు 118 మాత్రమే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే భారత్ లాంటి వర్ధమాన దేశానికి ప్రైవేటు, భీమా రంగాలపై ఆధారపడే వైద్య విధానం పనికి రాదు.
Comments
Please login to add a commentAdd a comment