
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా అమర జవాన్లకు సోమవారం త్రివిధ దళాధిపతులు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద పుప్పగుచ్ఛాలు ఉంచి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనావో తదితరులు అంజలి ఘటించారు. దేశరక్షణలో ప్రాణాలను కోల్పోయిన అమర వీరుల సేవలను స్మరణకు తెచ్చుకున్నారు. 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ 'సర్ ఫ్రాన్సిస్ బచ్చర్' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్-చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ‘ఆర్మీ డే’ నిర్వహిస్తారు.