
నా ఉద్దేశం అదికాదు..
జైపూర్: యుద్ధాలు లేకపోవడం వల్లే సైన్యం ప్రాధాన్యం తగ్గిందన్న కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ...ఆయన వివరణ ఇచ్చారు. 'తన ఉద్దేశం అది కాదంటూ' చెప్పుకొచ్చారు. గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఏ విధమైన యుద్ధంలో పాల్గొనకపోవడంతో భారత సైన్యం ప్రాధాన్యత తగ్గిపోయిందని మనోహర్ పారికర్ నిన్న జైపూర్లో జరిగిన ఓ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విమర్శలు చెలరేగడంతో పారికర్ 'నా ఉద్దేశం అదికాదు' అంటూ నాలిక్కరుచుకున్నారు. దేశంలో యుద్దాలు రావాలని నేను ఆకాంక్షించడంలేదు.. సైన్యం లేకపోతే దేశ అభివృద్ధి లేదు అంటూ వివరణ ఇచ్చుకున్నారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు రాసినా కొన్ని విషయాలను పట్టించుకోలేదనీ, అందుకే సైన్యానికి ప్రాధాన్యత తగ్గిందని వ్యాఖ్యానించానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప యుద్ధాలు రావాలని తాను కోరుకోవడం లేదన్నారు.
దేశంలో శాంతియుత వాతావరణం ఉన్న సమయంలో సైనికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజలకు సైనికుల పట్ల ఉన్న గౌరవం తగ్గుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు దాదాపు రెండు తరాలు యుద్ధాలను చూడకుండానే రిటైరయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.