
'ఆర్మీ చీఫ్'పై పారికర్ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేవలం సీనియారిటీని మాత్రమే ప్రాతిపదిక తీసుకుంటే కంప్యూటర్‌ను కూడా ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేయవచ్చని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రతి అంశానికి సీనియారిటీతోనే ముడిపెట్టడం సరికాదని తాము సరైన వ్యక్తినే ఆర్మీ చీఫ్‌గా ఎంపికచేశామని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్‌ను ఎంచుకునే విషయంలో సీనియారిటీని, నిబంధనలు పక్కకు పెట్టారు కదా అని ఆయనను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. ఒక్క సీనియారిటిని మాత్రమే తీసుకుని నియామకాలు జరిగితే, ఒక ప్రత్యేక నియామక విధానాలు ఎందుకు, కేబినెట్ కమిటీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
'సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఎక్కడ ఉందో నాకు తెలియదు. కమాండర్స్ పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రత్యేక విధివిధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైతే ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేశామో వారు అన్ని విధాల తగినవారని మీకు హామీ ఇస్తున్నాను. అందుకే ఈ విషయంలో మేం తొందరపడి నిర్ణయం తీసుకోలేదు' అని పారికర్ అన్నారు. గత నెలలో ఆర్మీ చీఫ్‌గా కేంద్రం జనరల్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనకంటే సీనియారిటీ ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి, మరో లెఫ్టినెంట్ జనరల్ పీఎం హారిజ్‌ని పక్కకు పెట్టి మరీ రావత్‌ను ఎంపిక చేశారు.