ఒక్కడి కోసం.. ఏకమవుతున్న భారతీయం..
అన్యాయాన్ని ఎదిరించడం భారతీయుల రక్తంలోనే ఉంది. అందుకోసం ఒక్కటి కావడం చరిత్ర మనకు నేర్పిన పాఠం. శాంతి, సహనాలు కర్మభూమి మనకిచ్చిన ఆయుధాలు. అందుకే ఎన్నో అరాచకాలను ఈ ఆయుధాలతోనే ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యాం. విజయాలు సాధించాం. ఆ విజయాలే స్ఫూర్తిగా మరో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు దేశంలోనే కాదు.. విదేశాల్లో ఉంటున్న భారతీయులంతా ఎకమవుతున్నారు. ఎందుకోసం? అని అడిగితే సమాధానం ‘ఒక్కడి కోసం’. ఆ ఒక్కడు ఎవరంటే...
కుల్‌భూషణ్ జాదవ్... గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. భారతీయులంతా అతణ్ని బతికించుకునేందుకే ఆరాటపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జాదవ్ ఇప్పుడున్నది మన దాయాది పాకిస్తాన్ చెరలో. అలా ఎంతోమంది ఉన్నప్పటికీ.. జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించింది. తప్పుడు ఆరోపణలను ఆయనపై మోపి.. జాదవ్‌ను ఉరితీయడం ద్వారా భారత్‌ను బాధపెట్టాలనుకుంటోంది. అందుకే భారత్ చేసిన విన్నపాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు.
ఏకమవుతున్న భారతీయం..
జాదవ్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వమే కాదు.. భారతీయులంతా ఏకమవుతున్నారు. పాక్ వక్రబుద్ధిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులంతా జాదవ్‌ను రక్షించుకునేందుకు వైట్‌హౌస్‌లో పిటిషన్ దాఖలు చేశారు. జాదవ్ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరుతున్నారు. ఇందుకోసం ఎస్.ఎస్ అనే ఓ వ్యక్తి అమెరికా వైట్ హౌస్‌కు అర్జీలు పెట్టుకునే ‘వీ ది పీపుల్ పిటిషన్’ అనే వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో ఈ పిటిషన్ ప్రారంభించారు. మే 14లోపు దీనిపై లక్ష సంతకాలు చేస్తే ట్రంప్ పరిపాలన వర్గం స్పందిస్తుంది. ఇప్పటికే ప్రారంభించిన ఈ సంతకాల సేకరణలో లక్షలాదిమంది భారతీయులు సంతకాలు చేశారు. అమెరికా వంటి దేశం ఇలాంటి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలంటే సదరు పిటిషన్‌పై కనీసం లక్షమందికిపైగా సంతకాలు చేయాలి. అయితే సంతకాల సేకరణ పెద్ద లక్ష్యమేమీ కాకపోవచ్చు. కానీ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకురావడమంటే ప్రపంచం దృష్టికి తీసుకురావడమే.
ఇదీ పిటిషన్..
‘జాదవ్ నిర్దోషి. తప్పుడు అభియోగాలను అతనిపై రుద్ది.. అతణ్ని ఉరితీయాలని పాక్ చూస్తోంది. ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలి. అందుకు అంతటి సామర్థ్యమున్న అధికారులను రంగంలోకి దింపాలి. పాక్ చెబుతున్నట్లుగా జాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడో లేదో నిగ్గు తేల్చాలి. ఇరాన్ మీదుగా పాక్‌లోకి చొరబడుతుండగా బెలూచిస్తాన్ వద్ద జాదవ్‌ను పట్టుకున్నామని, అతని ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడని పాక్ చెబుతోంది. ఈ ఆరోపణలకు రుజువులు చూపాలని పాక్‌ను భారత్ కోరినా సమాధానమే కరువైంది. అందుకే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మరోసారి కోరుతున్నాం. ’