న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే నేర చరితులపై లా కమిషన్ తనదైన శైలిలో కఠిన వైఖరి అవలంబించింది. అభ్యర్థుల నేర చరిత్ర, అఫిడవిట్‌లలో పొందుపరిచే సమాచారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే తప్ప రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశించకుండా జాగ్రత్త పడడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. గరిష్టంగా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షపడే కేసుల్లో ఒక వ్యక్తిపై కోర్టు అభియోగాలు నమోదు చేస్తే.. సదరు వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు అనర్హత వేటు వేయాల్సిందేనని ఉద్ఘాటించింది.
దోష నిర్ధారణ జరిగే వరకు వేచి చూసేధోరణిని కమిషన్ తప్పుబట్టింది. విచారణలో జరుగుతున్న కాలహరణం, దోష నిర్ధారణకు సుదీర్ఘ సమయం పడుతుండడం వంటివి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకునే నేరస్తులకు వరంగా మారుతున్నాయని తేల్చిచెప్పిన కమిషన్, ఈ క్రమంలో అభియోగాలు నమోదైన వెంటనే సదరు వక్తులపై అనర్హత వేటు వేయాలని సూచించింది. అదేవిధంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచా రం ఇచ్చే అభ్యర్థులకు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కనీసం రెండేళ్లకు తక్కువ కాకుండా కఠిన శిక్ష విధించాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ తన సిఫార్సులను సుప్రీంకోర్టుకు సమర్పించింది. కమిషన్ చేసిన కీలక సిఫార్సులు..
- ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించే సమయానికి కచ్చితంగా ఏడాది ముందు నమోదైన అభియోగాల ఆధారంగా సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయరాదు.
- అభియోగాలపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు సదరు వ్యక్తిని విడుదల చేసే వరకు లేదా ఆరేళ్ల వరకు అనర్హత కొనసాగించాలి.
- సిట్టింగ్ ఎంపీ/ఎమ్మెల్యేలపై నమోదయ్యే అభియోగాలపై ఏడాదిలోగా విచారణను పూర్తి చేయాలి, రోజువారీ విచారణ చేపట్టాలి. అయితే, సీఆర్‌పీసీ సెక్షన్ 173 ప్రకారం పోలీసులు నమోదు చేసే అభియోగాల ఆధారంగా అప్పటికప్పుడే అనర్హత వేటు వేయడం సమంజసం కాదు.
- అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అవినీతికి పాల్పడినట్టుగా భావించి రెండేళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలి.
అభియోగాలు నమోదైతే అనర్హతే!
Published Tue, Mar 11 2014 5:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement