స్పష్టమైన ఆధారాలున్నాయ్
- సైనికుల తలలు నరకడంపై పాక్‌కు భారత్ స్పష్టీకరణ
- పాక్ ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత సైనికుల తలలను పాకిస్తాన్ సైనికులే నరికారనడానికి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను భారత్ కోరింది. ఈ ఘటనను ‘తీవ్రమైన కవ్వింపు చర్య’గా భారత్ పరిగణిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. నియంత్రణ రేఖ కృష్ణ ఘాటీ వద్ద సేకరించిన రక్తపు నమూనాలు మృతిచెందిన భారత సైనికుల రక్తంతో సరిపోలు తున్నాయన్నారు. ఢిల్లీలో పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను విదేశాంగ కార్యదర్శి జెశంకర్ బుధవారం పిలిపించి నిరసన తెలిపారు.
ఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను అందజేయడంతో పాటు ఈ అమానుష కాండకు పాల్పడిన పాక్ సైనిక సిబ్బందిపై, ఆర్మీ కమాం డర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జైశంకర్ డిమాండ్ చేశారు. హంతకులు ముమ్మాటికే పాక్ నుంచి వచ్చిన వారేనని పాక్ రాయబారికి వివరించినట్టు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, పాక్ సైనికుల చేతిలో హత్యకు గురైన బీఎస్‌ఎఫ్ సైనికుడు ప్రేమ్ సాగర్ అంత్య క్రియలు ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం తికంపూర్‌లో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైనికుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.