భవనం కుప్పకూలిన ప్రదేశం
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సర్వతే బస్టాండ్ సమీపంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలి 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
కూలిపోయిన భవనంలో ఎంఎస్ పేరుతో లాడ్జి, హోటల్ నిర్వహిస్తున్నారు. భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో జనం పరుగులు తీశారు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కాలేదు.
స్పందించిన సీఎం
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment