
స్కార్పిన్ తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ కరంజ్
సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మక స్కార్పిన్ శ్రేణి సబ్ మెరైన్లలో మూడో సబ్ మెరైన్ ఐఎన్‌ఎస్ కరంజ్ బుధవారం జల ప్రవేశం చేసింది. ముంబైలోని మజ్‌గావ్ డాక్ యార్డ్‌లో కరంజ్ జల ప్రవేశాన్ని నేవీ అధికార లాంఛనాలతో నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ సునీల్ లాంబా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో మజ్‌గావ్ డాక్‌లో స్కార్పిన్ తరగతికి చెందిన ఆరు సబ్ మెరైన్లను భారత్ రూపొందిస్తోంది. నీటి లోపల శత్రువుల సోనార్‌కు తన ఉనికిని తెలియనివ్వకుండా, దాడులు చేయగలగడం కరంజ్ సామర్ధ్యం. కరంజ్ నుంచి విడుదలయ్యే ధ్వని, రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది.
ఇతర సబ్‌మెరైన్‌లతో పోల్చితే నీటి లోపల కరంజ్‌ను గుర్తించడం అతి కష్టం. సముద్ర లోతుల్లో ఉండే నీటిలో దీని రంగు కలిసిపోవడమే ఇందుకు కారణం. ఆరు స్కార్పిన్ తరగతి సబ్‌మెరైన్లలో ఐఎన్‌ఎస్ కరంజ్ మూడోది. 2017 డిసెంబర్‌లో ఐఎన్‌ఎస్ కల్వరి(స్కార్పిన్ క్లాస్ తొలి సబ్ మెరైన్) నేవీలోకి రంగ ప్రవేశం చేసింది.
2017 జనవరిలో ఖండేరీ సబ్‌మెరైన్‌ను సీ ట్రయల్స్ కోసం లాంచ్ చేశారు. ప్రస్తుతం దీని ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఖండేరీ కూడా భారత నేవీలోకి అధికారికంగా చేరనుంది. కాగా, ఇప్పటివరకూ పాత తరాలకు చెందిన సబ్‌మెరైన్లతో ఇబ్బందులు పడుతున్న భారత నేవీకి స్కార్పిన్ తరగతి సబ్‌మెరైన్ల రాక కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
స్కార్పిన్ శ్రేణి ప్రత్యేకత ఇదే..
స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను రకరకాల మిషన్ల కొరకు వినియోగించుకునే అవకాశం ఉంది. నీటిలోపల నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను చేధించేందుకు, శత్రువుల జలాంతర్గాములను నాశనం చేసేందుకు, గూఢచర్యం రీత్యా, శత్రువులపై డేగ కన్ను వేయడానికి స్కార్పిన్ తరగతి సబ్‌మెరైన్లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో నావల్ టాస్క్ ఫోర్స్ వద్ద ఉన్న పలు ఆయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం వీటి సొంతం.
Comments
Please login to add a commentAdd a comment