
రాంచీ : అందరి కోసం యోగా.. అందరికి యోగా అనేది మన నినాదం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాజధాని రాంచీ ప్రభాత్ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నేతృత్వం వహించారు. దాదాపు 40వేల మంది యోగా ఔత్సాహికులతో కలిసి మోదీ ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రుల అమిత్ షా, రాజనాథ్ సింగ్‌తో పాటు పలవురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ప్రతిదేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంది. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని కలుగుజేస్తుంది. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది. యోగా వల్ల హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్యసాధనం. రోగాలు దరిచేరకుండా యోగా దోహదపడుతుంది. క్రమశిక్షణ, అంకిత భావంతో యోగా పాటించాలి. యోగాకు వయస్సు, రంగు, కులం, మతం సంపన్నులు, పేదలు అనే తేడా లేదు. యోగా అందరిది. యోగా అనేది అనాదిగా మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. మనమందరం యోగా సాధనను మరో స్థాయికి తీసుకెళ్లాలి. యోగా వల్ల కలిగే లాభాలను ప్రచారం చేయాలి’ అన్నారు మోదీ.