ఐఆర్‌సీటీసీ స్కామ్ రబ్రీ దేవి, తేజశ్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు చేసిన పాటియాల కోర్టు
న్యూఢిల్లీ : ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం రబ్రీదేవి, తేజశ్వి యాదవ్‌లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.
కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన కోర్టు, నవంబర్ 19న జరిగే విచారణకు లాలూ తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐఆర్‌సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment