ఒక్క ప్రాణం పోకుండా తిరిగొస్తే ఇన్ని అవమానాలా?
రాజకీయాలంటేనే కపట వేషాలు సహజం. అందులోని కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన లక్షణాలు కలవారనే విషయాన్ని తోసిపుచ్చలేం. అయితే, వారు ఒక వ్యక్తినో పదిమందినో మోసం చేయగలరు గానీ.. ఓ వ్యవస్థ మొత్తాన్ని మోసం చేయడం సాధ్యం కాని పని. అలాంటిది దాదాపు 120 కోట్ల జనాభాగల దేశం మనది. ఇంత పెద్ద దేశాన్ని, అందులోని వ్యక్తులందరినీ మోసం చేయడం వల్ల కాని పని. అందులోని పొరుగింటి వాళ్లు (అంతర్జాతీయ సమాజం) కూడా మన దేశం పైనే కళ్లప్పగించి చూస్తున్న పరిస్థితి. పైగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశమంటే ఒక రకమైన ఆసక్తి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఒక వ్యక్తి లేదా వ్యవస్థ లేదా రాజకీయ పార్టీ తన స్వార్థానికి ఉపయోగించుకుంటుందని, దారుణంగా మోసం చేస్తుందని ఆలోచించడం నిజంగా పరిపక్వత లేని దృష్టినే చూపిస్తోంది.
పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత ఆర్మీ సమర్ధంగా సర్జికల్ దాడిని నిర్వహించి వచ్చిన విషయం తెలిసిందే. మందుపాతర వల్ల ఒకే ఒక్క సైనికుడికి స్వల్ప గాయాలవడం తప్ప ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా మన జవాన్లు తిరిగొచ్చారు. ఇలాంటి సమయంలో వారిని చూసి గర్వించాల్సింది పోయి రాజకీయాలకు ముడిపెట్టి భారత ఆర్మీ శక్తియుక్తులపై అనుమానం వ్యక్తం చేయడం దుర్మార్గం. అసలే దాయాది శత్రుదేశం (పాకిస్థాన్) కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే రకం. అడ్డగోలుగా దాడులు చేస్తూ ఒప్పందాలను సైతం ఉల్లంఘించే పద్ధతి.. పాడు లేని దేశం. అలాంటి దేశం ఏరకమైనా దాడులైనా చేస్తుంది.. ఎలాంటి ఆరోపణలైనా చేస్తుంది. వాటన్నింటినీ అంతర్జాతీయ సమాజమే సరిగా నమ్మకపోయినా.. సొంత దేశంలోనే కొంతమంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, విద్యావేత్తలం అనుకుంటున్నవాళ్లు బహిరంగంగా, ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో చొరబడి అడ్డగోలుగా భారత వీరపుత్రులను అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రం ఈ దాడులు చేయించిందని తొలుత వదంతులు పుట్టగా, అసలు దాడులే చేయలేదని, ఈ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం హడావుడి చేసిందని, నిజంగా దాడులు జరిగి ఉంటే ఆ ఫుటేజీని బయటపెట్టాలని అటు పాకిస్థాన్ మీడియా లేనిపోని కట్టుకథలు అల్లగానే వాటిని వకల్తా పుచ్చుకొని మన దేశంలోని కొంతమంది నుంచి కూడా వ్యాఖ్యానాలు బయలుదేరాయి.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ మొత్తం దేశాన్ని మోసం చేసే సాహసం చేస్తారా? అంతర్జాతీయ సమాజం ముందు ఆయన భారత ఆర్మీ పరువు తీస్తారా? ఒకవేళ అసలు దాడులే జరగకుంటే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అగ్గిమీద గుగ్గిలమై 'మేం చేతులు కట్టుకొని కూర్చోలేదు. మా శాంతి చేతగానితనం అనుకోవద్దు' అని ఎందుకు అంటారు? 'భారత సైన్యం దాడి చేసింది, అవసరం అయితే అణుదాడులు చేస్తాం' అని పాక్ రక్షణమంత్రి మాటలెందుకు పేలుతారు? ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటనలు ఎందుకు చేస్తుంది? పాక్ సహజంగా అహంకార స్వభావం కలిగిన దేశమైనందున అవకాశం దొరికిన ప్రతిసారీ అబద్ధాలు వల్లేవేసే అలవాటున్న దేశమైనందున ఎలాంటి ప్రకటనలైనా చేస్తుంది? దెబ్బతిని కూడా తమ పరువు పోతుందని ఆ విషయాన్ని అంగీకరించేందుకు శంకిస్తోంది. అందుకే పాక్ మీడియాతో పనిగట్టుకొని దాడులు జరగలేదని, భారత్ నాటకాలు ఆడుతోందని, అంతర్జాతీయ మీడియాకు కూడా ఈ విషయం అర్థమైందంటూ కట్టుకథలు పుంఖానుపుంఖాలుగా పుట్టిస్తోంది.
ఇలా రెచ్చగొట్టడం ద్వారా భారత్ పౌరుషానికి వచ్చి ఎప్పుడు ఫుటేజీ విడుదల చేస్తుందా.. దాని నుంచి ఎలాంటి లబ్ధి పొందుదామా అని గోతికాడి నక్కలా ఎదురుచూస్తోంది. అది పొరుగుదేశం, శత్రుదేశం కాబట్టి ఫుటేజీపై అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయడం సహజం. అది పన్నిన మాయలో పడి భారత ఆర్మీ దాడులు చేయనే లేదన్నట్లుగా.. ఒకవేళ దాడి చేస్తే ఫుటేజీ విడుదల చేయాలన్నట్లు ఇష్టమొచ్చిన ప్రకటనలు చేయడం ముమ్మాటికీ భారత ఆర్మీని, దాని శక్తియుక్తులను అవమానించినట్లవుతుంది. వారి మనోధైర్యాన్ని దెబ్బతీసినట్లుతుంది. ఏ దేశం కూడా ఇప్పటివరకు తాము నిర్వహించిన సైనికుల దాడులకు సంబంధించిన ఫుటేజీలను ప్రజలకు నేరుగా చూపించలేదు. ఎప్పటికో గానీ, కొన్నికొన్ని క్లిప్పింగుల రూపంలో అది కూడా సమయాన్ని బట్టి విడుదల చేశారు. ఇలాంటివి వెంటనే బయటపెడితే సైనిక వ్యూహాలు లీకవుతాయి. మన శక్తియుక్తులు బయటకు తెలిసిపోతాయి. శత్రుదేశానికి అది మరింత ఉపకరిస్తుంది. మొత్తం దేశానికి సంబంధించిన సర్జికల్ దాడుల ఫుటేజీ అంశానికి రాజకీయాలను పూసి అర్థం పర్థం లేని చర్చలకు దిగడం తగదు. ఇలా చేయడం మొత్తం భారతదేశ సామర్థ్యాన్ని అవమానించినట్లే అవుతుంది.
యం.నాగేశ్వరరావు, సాక్షి ఇంటర్నెట్