
బిహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్!
పట్నా: మహాకూటమితో నితీశ్ కుమార్ సంబంధాలు తెంచుకోవడం పట్ల జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గతరాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రకటనపై శరద్ యాదవ్ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో నితీశ్ నిర్ణయంపై శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సాయంత్రం జేడీ(యూ) ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. బీజేపీతో అంటకాగడంపై విమర్శలు చేసిన ఎంపీ అన్వర్ అలీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చిస్తారన్న దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది కీలకంగా మారింది.
మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుతో రేపు బలనిరూపణకు నితీశ్ సిద్ధమవుతున్న తరుణంలో బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాగా, గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీ తీరుపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. త్రిపాఠీపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు లాలూ తెలిపారు.