లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్‌పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి.
2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్‌నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్‌పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు.
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
Published Thu, Mar 2 2017 8:33 PM | Last Updated on Thu, Jul 11 2019 7:36 PM
Advertisement