
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌కు రంగం సిద్ధమవుతోంది. రూ.10 వేల కోట్ల ఖర్చుతో వ్యోమగాములు వారం రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు ఉద్దేశించిన ఈ భారీ ప్రయోగానికి అవసరమైన అన్ని సాంకేతికతలు, వసతులను ఇస్రో ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటోంది. డిజైన్ రూపకల్పన, పారాచూట్స్, స్పేస్ సూట్ల తయారీకి సంబంధించి ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు క్లుప్తంగా..
ముందుగా రోబోలు
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా రోబోలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసింది. 2022లో మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ముందుగా మనుషులను పోలిన రోబోల (హ్యుమనాయిడ్స్)తో ప్రయోగాలు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబో సిద్ధమైపోయిందని వివరించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే సత్తా భారత్‌కు ఉందని నిరూపించడంతో పాటు సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కూడా సాధ్యమని చాటి చెప్పాలన్నది తమ లక్ష్యమంటున్నారు. ‘ఇస్రో సిద్ధం చేసిన హ్యూమనాయిడ్ రోబో మనిషి చేయగల అన్ని పనులు చేయగలదు. గగన్‌యాన్ సన్నాహక ప్రయోగాల్లో భాగంగా చేసే తొలి ప్రయోగం లోనే దీన్ని వాడతాం. బయో ఫిల్టర్లు, సెన్సర్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రయోగాలు చేపడతాం’అని చెప్పారు. దేశంలోని పరిశోధన సంస్థలు కూడా తమ ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయని నిపుణుల కమిటీ వాటిని విశ్లేషించి కొన్నింటినీ చేపట్టే అవకాశం ఉందని అంచనా. గగన్‌యాన్ డిజైన్‌కు సంబంధించిన పనులు వచ్చే వారానికల్లా పూర్తవుతాయని శివన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 11 కమిటీలను ఏర్పాటు చేశామని ఇవి ఒక్కో ఉపవ్యవస్థ డిజైన్‌ను పరిశీలించి ఓకే చేస్తుందన్నారు. డిజైన్ ఖరారు తర్వాత అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవడం మొదలవుతుందని, పరిశోధన శాలలో నమూనా వ్యవస్థలను తయారు చేస్తామని చెప్పారు.
త్వరలో ‘మాడ్యూల్స్’డిజైన్లు ఖరారు
గగన్‌యాన్‌కు అవసరమైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాములు ఉండే గది), క్రూ సర్వీస్ మాడ్యూల్ డిజైన్ల కరారు ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, త్వరలో డిజైన్లు ఖరారు చేస్తామని శివన్ చెప్పారు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పేరుతో కొత్తగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, గగన్‌యాన్‌కు సంబంధించిన పనులన్నీ అక్కడే జరుగుతున్నాయని తెలిపారు. క్రూ మాడ్యూల్, క్రూ సర్వీస్ మాడ్యూళ్లను ఇప్పుడే మొదటిసారిగా రూపొందించట్లేదని, వీటికి అవసరమైన మౌలికవసతులు ఇప్పటికే తమకు ఉన్నాయని చెప్పారు. ఇస్రో కొన్ని సంవత్సరాల కిందటే క్రూ మాడ్యూల్‌ను ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపి మళ్లీ వెనక్కి తీసుకొచ్చింది. గతేడాది క్రూ ఎస్కేప్ సిస్టం (రాకెట్‌లో వెళ్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థ)ను కూడా పరీక్షించింది. 259 సెకన్ల పాటు జరిగిన ఈ ప్రయోగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ, క్రూ మాడ్యూల్ సహా రాకెట్ నుంచి విడిపోయింది. అది బంగాళాఖాతంపై ఉండగా, దానికి అమర్చిన పారాచూట్‌లు విచ్చుకున్నాయి. వాటి సహాయంతో శ్రీహరికోటకు 2.9 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై దిగింది. అక్కడ నుంచి దాన్ని భూమి మీదకు తెచ్చారు. క్రూ మాడ్యూల్‌కు అమర్చిన ప్రత్యేకంగా రూపొందించిన 7 మోటార్లు క్రూ మాడ్యూల్‌ను అతివేగంతో రాకెట్ నుంచి ప్రమాదం జరగనంత దూరానికి తీసుకెళ్లాయి. 2022లో మానవులను పంపిస్తామని చెప్పారు.
వడోదరా స్పేస్ సూట్
అంతరిక్ష యాత్రలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుజరాత్‌లోని వడోదరాలో రూపొందించారు. విదేశాలు రూపొందిస్తున్న స్పేస్ సూట్లతో పోలిస్తే ఇది 20% తక్కువ బరువుంటుంది. ఇతర దేశాలు స్పేస్ సూట్ తయారీకి చేసిన వ్యయం కంటే వందో వంతు తక్కువ ఖర్చుతో రూపొందించారు. 4 పొరల ఈ స్పేస్‌సూట్‌ను ప్రత్యేకమైన పోగులతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. అంతరిక్షంలో ఉండే అధిక పీడన పరిస్థితులను తట్టుకునేలా రూపొందింది. శరీర ఉష్ణోగ్రతల్ని కొలిచే బయో సెన్సర్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతులకు వేసుకోవడానికి మృదువైన తొడుగులు, తేలిగ్గా ఉండే షూస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. ఈ స్పేస్ సూట్ మైనస్ 40 డిగ్రీల అతిశీతల పరిస్థితుల నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపకల్పన చేశారు.
ఆగ్రా పారాచూట్...
అంతరిక్షంలో వారం రోజులు గడిపి తిరిగి పయనమయ్యే ముగ్గురు భారతీయ వ్యోమగాములు భూమికి చేరుకునేటప్పుడు అవసరమయ్యే పారాచూట్‌లను ఆగ్రాలో తయారు చేశారు. డీఆర్‌డీవోకి చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వీటిని రూపొందించింది. తిరుగుప్రయాణంలో భూమికి 120 కి.మీ. ఎత్తులో క్రూ మాడ్యూల్, సర్వీసు మాడ్యూల్ వేరవుతాయి. అప్పట్నుంచి వ్యోమగాములు భూమి మీదకి చేరుకోవడానికి 36 నిమిషాలు పడుతుంది. గుజరాత్‌లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో క్రూ మాడ్యూల్ దిగడానికి ముందు ఈ పారాచూట్‌లు తెరుచుకుంటాయి. పారాచూట్‌లు క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు 216 మీటర్ల నుంచి 11 మీటర్లకి తగ్గిస్తాయి.
చాలా గొప్ప విషయం...
భారత్ అంతరిక్షానికి మనుషుల్ని పంపడానికి సిద్ధమవడం చాలా గొప్ప విషయం. రెక్కలు కట్టుకొని అంతరిక్షంలోకి వాలితే మనుషుల ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయి. గగన్‌యాన్‌తో భారత్ తన సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంతో అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఆసక్తి పెరిగి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది.
జెర్రీ రోజ్, నాసాకు చెందిన మాజీ వ్యోమగామి, ఏడుసార్లు అంతరిక్షానికి వెళ్లి రికార్డు సృష్టించిన వ్యోమగామి
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment