ఈవీఎం ట్యాంపరింగ్‌కు ముందుకురాని ఎన్సీపీ, సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ: తమ ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని నిరూపించాలని ఎన్నికల సంఘం(ఈసీ) విసిరిన సవాల్ శనివారం ఎలాంటి విశేషం లేకుండానే ముగిసింది. ట్యాంపర్ చేస్తామని ముందుకొచ్చిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఎంలు చివరి క్షణంలో సవాల్ నుంచి తప్పుకున్నాయి. దీంతో సవాల్ ముగిసిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ ప్రకటించారు.
భవిష్యత్తులో అన్ని ఎన్నికలను ఓటు రసీదు(వీవీప్యాట్)తో కూడిన ఈవీఎంలతో జరపనున్నందున ట్యాంపరింగ్ వివాదం ఇక ముగిసిందన్నారు. ఓటరు తను ఎంచుకున్న అభ్యర్థికే తన ఓటు పడినట్లు తనిఖీ చేసుకునే వీవీప్యాట్‌తో మరింత పారదర్శకత వస్తుందన్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలట్‌తో ఓట్లు నిర్వహించే వీలులేదన్నారు.
కోరిన సమాచారం ఇవ్వలేదు: ఎన్సీపీ
శనివారం ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సవాల్ కార్యక్రమంలో ఎన్సీపీ, సీపీఎంల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈవీఎం పనితీరు అర్థం చేసుకుంటామని, సవాల్‌ను స్వీకరించబోమని సీపీఎం తెలిపింది. ట్యాంపర్ చేయాల్సిన ఈవీఎం మెమరీ, బ్యాటరీ నంబర్లను ముందస్తుగా తమకివ్వలేదంటూ రాజ్యసభ ఎంపీ వందనా చవాన్ సారథ్యంలోని ఎన్సీపీ బృందం సవాల్ నుంచి తప్పుకుంది.
దీనికి ఈసీదే బాధ్యత అని ఆరోపించింది. ఈవీఎం పనితీరుపై తమ సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రదర్శనతో సీపీఎం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని జైదీ తెలిపారు. మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే తమ అనుమానాలకు ఆధారమని ఎన్సీపీ బృందం పేర్కొంది. సవాల్ ప్రక్రియను పరిశీలించడానికి తమను అనుమతించకపోవడం శోచనీయమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం అన్నారు.