హ్యాకింగ్ చాలెంజ్.. జూన్ 3న!
దేశంలో గత కొన్నాళ్లుగా ఈవీఎంల కచ్చితత్వం విషయంలో జరుగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. తాము ఉపయోగిస్తున్న ఈవీఎంల మీద ఫిర్యాదు చేసినవాళ్లు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. తమ వద్ద ఉన్న ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించడానికి వాళ్ల ఐటీ నిపుణులతో కలిసి ఏ పార్టీ వాళ్లయినా జూన్ 3వ తేదీన రావాలని ఆయన సవాలు చేశారు. ఈవీఎంల హ్యాకింగ్ చాలెంజ్‌కి ఆ విధంగా ముహూర్తం పెట్టేశారు.
ఏవైనా ఐదు నియోజకవర్గాల్లో ఉపయోగించిన వాటిలోంచి నాలుగు ఈవీఎంలను పార్టీలు ఎంచుకోవచ్చని, వాటిని హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేసి చూపించాలని నసీం జైదీ చెప్పారు. తాము వస్తున్న విషయాన్ని ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఖరారు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ప్రతి జాతీయ, ప్రాంతీయ పార్టీలు ముగ్గురిని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఎన్నికల సంఘానికి చాలా పార్టీలు ఈ విషయంలో ఫిర్యాదు చేశాయని, అయితే ఏ ఒక్కటీ కూడా ఆధారాలు మాత్రం చూపించలేదని తెలిపారు. ఈవీఎంలలో ఉండే చిప్‌ను ఒక్కసారే ప్రోగ్రాం చేయడానికి వీలుంటుందని, అందులో వై-ఫై చిప్ కూడా ఉండదని, అందువల్ల ట్రోజెన్ హార్స్‌ను చొప్పించడానికి వీలుండదని జైదీ అన్నారు. ఓటింగ్ యంత్రాల్లోకి వైరస్‌లను పంపడం కూడా అసాధ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్వహించే ఎన్నికలన్నింటినీ వీవీపాట్ మిషన్లతోనే నిర్వహిస్తామని, దానివల్ల మరింత పారదర్శకత ఉంటుందని ఆయన వివరించారు.