ట్యాంపరింగ్ నిరూపించండి!
► ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సవాల్
► తేదీని త్వరలో నిర్ణయిస్తామన్న ఈసీ
న్యూఢిల్లీ: ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్ని ట్యాంపర్ చేసినట్లు నిరూపించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) సవాల్ విసిరింది. ఈవీఎంల్ని ట్యాంపర్ చేశారంటూ విపక్షాల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈవీఎంలపై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుందని, పేపర్ బ్యాలెట్‌లు వాడాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేయగా.. ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాలు తప్పకుండా జతచేయాలని మరికొన్ని స్పష్టం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ మాట్లాడుతూ.. ‘ఈవీఎంల ట్యాంపరింగ్ నిరూపించాలని సవాలు విసురుతున్నాం.
ఇటీవలి ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్ని ట్యాంపర్ చేశారా? అన్న అంశంతో పాటు అత్యున్నత సాంకేతిక, నిర్వహణ ప్రమాణాలు పాటించినా సరే ఈవీఎంల్ని ట్యాంపర్ చేయవచ్చని నిరూపించేందుకు అవకాశం ఇస్తా’మని చెప్పారు. ఈవీఎంలకు సంబంధించి నెలకొన్న ఆందోళనలు, భయాల్ని త్వరలో తొలగిస్తామన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలకే ఈ సవాలు పరిమితం కాదని.. వేరే యంత్రాలూ అందుబాటులో ఉంటాయని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. సవాల్ తేదీని నిర్ణయించేందుకు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
మేం ఎవరికీ అనుకూలం కాదు: ఈసీ
ఈసీ ఏ పార్టీకి అనుకూలం కాదని, అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తుందని జైదీ తేల్చిచెప్పారు. ‘ఈసీ ఎవరికీ అనుకూలం కాదన్న విషయాన్ని మీరు నమ్మాలి. ఇది రాజ్యాంగపరమైన, నైతిక విధి. మొత్తం 56 రాజకీయ పార్టీలు(7 జాతీయ పార్టీలు, 49 ప్రాంతీయ పార్టీలు) మాకు ఒక్కటే’ అని స్పష్టం చేశారు. ఈవీఎంలకు వీవీపీఏటీ(ఓటు ఎవరికి వేశామో చెప్పే స్లిప్) యంత్రాల అనుసంధానంతో ఈవీఎంలపై విశ్వసనీయత, పారదర్శకత ఏర్పడుతుంది. అలాగే అన్ని వివాదాలకు ముగింపు పలకవచ్చన్నారు.
ఈవీఎంలకు పలు పార్టీల మద్దతు
ఈవీఎంలకు బీజేపీ, సీపీఐ, సీపీఎం, అన్నాడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, జేడీయూలు పూర్తి మద్దతిస్తూ.. తప్పకుండా పేపర్ ట్రయల్ యంత్రాలు జతచేయాలని కోరాయి. బీఎస్పీ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు మాత్రం పేపర్ బ్యాలెట్ వ్యవస్థే ఉత్తమమని వాదించాయి.