
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియరు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న విభేదాల్లో జోక్యం చేసుకోబోమని, ఈ అంశాన్ని న్యాయవ్యవస్థ తనంతట తాను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రపంచంలో మన న్యాయవ్యవస్థకు ఎంతో గొప్ప పేరుంది. ఈ వివాదాన్ని మన స్వతంత్ర న్యాయ వ్యవస్థే పరిష్కరించు కుంటుంది’ అని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదురీ పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కానందున.. వేచిచూసే ధోరణి అనుసరించాలనే యోచనలో కేంద్రం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వివాదం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, అందువల్లే దీనిపై స్పందించేందుకు ఏమీ లేదని.. అయితే న్యాయవ్యవస్థపై ప్రజా విశ్వాసం దెబ్బతినకుండా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.