మరో ఆత్మహత్య జరగకుండా చూడండి : కేతిరెడ్డి
న్యూఢిల్లీ :
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని కోరారు.
చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన వార్త విషయం తెలిసిందే. ఈ వార్త వినగానే తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు దిగ్భార్రాంతికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ షాకింగ్ వార్త వినగానే కొందరు గుండె పోటుతో, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని దాదాపు 400 మంది సామాన్య ప్రజలు మృతిచెందినట్టు ఎన్‌హెచ్చార్సీ దృష్టికి తీసుకువచ్చారు. మృతుల్లో రోజూవారి కూలీలతోపాటూ పేదలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు.
అమ్మ మరణవార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాల్లో మరోకరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాని కోరారు.