Telugu yuva sakthi
-
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై: తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనను కీర్తిస్తూ ‘10 నెలల్లో పది సంవత్సరాల ప్రగతి’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెన్నైలోని పూనమల్లే హైరోడ్డులోని పుల్లారెడ్డిపురంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో తమిళనాడును ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతర కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కొంతకాలంగా తమిళనాడులో నివసిస్తూ తమిళులుగా మమేకమైన తెలుగు వారిని కొన్ని పార్టీలు, పత్రికలు, సోషల్ మీడియా కేంద్రంగా పని చేసే ఛానళ్ళు ద్వేషించడం మాత్రమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. శేషాచలం అడవుల్లో కలప దొంగల్ని ఎన్కౌంటర్ చేస్తే చెన్నైలో ఆంధ్ర సంఘం మీద దాడి చేయించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా తెలుగు వారిని కాపాడుటకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు
చెన్నై : ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ ప్రయత్నానికి కోర్టు తీర్పు అడ్డు తగలడంతో తన వారసునిగా ఎడపాడి కె పళనిస్వామిని ప్రకటించడంపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏఐఏడీఎంకే పార్టీకి, ప్రజలకు కావాలిసింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసులు కానీ, శశికళ వారసులు కాదని ఎద్దేవా చేశారు. ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్ సెల్వానికి శాసన సభ్యులు మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్ సెల్వంకి మద్దతు తెలపకపోతే శాసన సభ్యులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం మొదలు అయ్యే అవకాశం ఉందని కేతిరెడ్డి హెచ్చరించారు. -
పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన కేతిరెడ్డి
చెన్నై: ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వానికి తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. కేతిరెడ్డి శనివవారం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో పన్నీరు సెల్వంను కలిశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తాను చేసిన న్యాయపోరాటం, ప్రజా ఉద్యమాలను వివరించారు. అదే విధంగా కేంద్రప్రభుత్వాన్ని జయలలిత మరణం వెనుక దాగి ఉన్న కుట్రలను వెలికితీయడాకి సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన విషయాన్ని పన్నీరు సెల్వం వద్ద ప్రస్తావించారు. జయలలిత ఆశయాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం గురించి కేతిరెడ్డి వివరించారు. అంతేకాకుండా తమిళనాడులోని తెలుగువారి సమస్యలను పన్నీర్ సెల్వం దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని కేతిరెడ్డి తెలిపారు. -
మరో ఆత్మహత్య జరగకుండా చూడండి : కేతిరెడ్డి
న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని కోరారు. చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన వార్త విషయం తెలిసిందే. ఈ వార్త వినగానే తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు దిగ్భార్రాంతికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ షాకింగ్ వార్త వినగానే కొందరు గుండె పోటుతో, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని దాదాపు 400 మంది సామాన్య ప్రజలు మృతిచెందినట్టు ఎన్‌హెచ్చార్సీ దృష్టికి తీసుకువచ్చారు. మృతుల్లో రోజూవారి కూలీలతోపాటూ పేదలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు. అమ్మ మరణవార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాల్లో మరోకరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాని కోరారు.