
పెరోల్‌పై వచ్చి బాహుబలి 2 చూసి జంపయింది
అహ్మదాబాద్: పైకి చూడటానికి ఆమె ఒక సన్యాసి. పేరు జై శ్రీ గిరి. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ ఓ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది తొలి రోజుల్లో (జనవరిలో) గుజరాత్ పోలీసులు ఆమె ఆశ్రయంపై దాడులు నిర్వహించగా బిత్తరపోయే విషయాలు వెలుగుచూశాయి. పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయింది. తన ఆశ్రమంలో కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతోపాటు మద్యం సీసాలు కూడా పెద్ద మొత్తంలో లభించాయి.
దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉంచిన పోలీసులు ఇటీవలె ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్‌పై నలుగురు పోలీసులను గార్డులగా ఇచ్చి బయటకు పంపించారు. అయితే, ఆరోగ్య పరీక్షల పేరిట బయటకు వచ్చిన ఆమె పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత తనకు కొంత విరామం కావాలంటూ బ్రతిమిలాడుకుంది. అహ్మదాబాద్‌లోని హిమాలయన్ మాల్‌కు తన వ్యక్తిగత లాయర్, పోలీసు గార్డులతో వెళ్లింది. ఏం చక్కా నచ్చిన ఫుడ్డు లాగించేసి.. అనంతరం తాఫీగా మసాజ్ చేయించుకుంది. ఆ వెంటనే భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళుతున్న బాహుబలి 2 చిత్రాన్ని చూసింది. ఆ సమయంలో నిరంతరం ఫోన్‌లో మాట్లాడిన ఆమె తన పెరోల్ మరింత పొడిగించే అవకాశం ఉందా అని కనుక్కుంది.
అయితే, ఎప్పుడైతే ఆమె పెరోల్ గడువు పొడిగించడం లేదని తెలిసిందో ఆ వెంటనే తాను వాష్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి అటునుంచి అటే పారిపోయింది. దీంతో బిత్తరపోవడం ఆమెకు కాపలాగా ఉన్న గార్డుల వంతైంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి గార్డుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె పారిపోయిందంటూ వారిని, ఆమె న్యాయవాదిని అరెస్టు చేశారు. ఈ నలుగురు గార్డులకు కూడా ఈ మధ్య శిక్షణ పూర్తయిందట. ప్రస్తుతం ఇతర పోలీసులు ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు. ఈమె దాదాపు రూ.5కోట్ల విలువైన బంగారాన్ని అక్రమ మార్గంలో ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.