నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట! | Jain monk wants 8 months to appear before court, here's why | Sakshi
Sakshi News home page

నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట!

Published Sat, Nov 7 2015 1:15 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట! - Sakshi

నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట!

ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావడానికి  నిందితుడు అడిగిన గడువును చూసి,  హైకోర్టు జడ్జిలే విస్తుపోయారట. చివరికి గడువు లేదు గిడువు లేదు...  చట్ట ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఇంతకీ సదరు వ్యక్తి  అడిగిన గడువు, దాని కథా కమామిష్షు ఏంటంటే..

'బాలదీక్ష' అనే తప్పుడు ప్రభుత్వ పథకాన్ని  ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా  ఉన్న బాలికలను మభ్య పెట్టి, మోసగించారనే ఆరోపణలపై  జైన్ గురువు ఆచార్య  కీర్తి యశురిష్వరాజి మహారాజ్ సహా మరో అయిదుగురిపై   క్రిమినల్  కేసులు  నమోదయ్యాయి.  అయితే తమకు  కోర్టు ముందు  హాజరు కావడానికి ఎనిమిది నెలల గడువు కావాలని  జైన్ గురువు తదితరులు గుజరాత్ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.

 

ఎందుకంటే కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు నడిచి రావడానికి  ఎనిమిది నెలల సమయం పడుతుందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.  దీంతో పాటుగా తాను జైన్ మత సంప్రదాయం  ప్రకారం వాహనాలను  వాడరాదని, కాలి నడకన రావడానికి తనకు ఇంత సమయం పడుతుందని యశురిష్వరాజి సెలవిచ్చారు.  తన  అనారోగ్య కారణాల రీత్యా గంటకు 10- 12 కి.మీ కంటే ఎక్కువ దూరం నడవలేనని అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు.  సుమారు 2,200 కి.మీ నడిచి కోర్టుకు హాజరు కావాలంటే ఆ మాత్రం సమయం కావాలన్నాడు.

ఈ పిటిషన్ చాలా వింతగా, విచిత్రంగా ఉందంటూ  హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా  యశురిష్వరాజి మహారాజ్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఒక క్రిమినల్  కేసులో  నిందితులుగా ఉన్నారన్న సంగతిని  వారు మర్చిపోతున్నారని మండిపడ్డారు. నిర్దేశిత  సమయానికి  కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.  లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement