సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను సోమవారం నాడు 12 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టామని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. ఈ వార్తను అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వార్తతోపాటు సైనిక కమాండర్ దుస్తుల్లో ఉన్న కమ్రాన్ ఫొటోను ఇండియా టుడేతోపాటు ఏబీపీ న్యూస్, జీ న్యూస్, ఇండియా టీవీ, అవుట్‌లుక్, ది ఎకనామిక్ టైమ్స్ ఇలా చాలా మీడియా సంస్థలు చూపించాయి. (ఎన్‌కౌంటర్‌లో కమ్రాన్ హతం)
అది మార్ఫింగ్ ఫొటో అని ఈ మీడియా సంస్థలు గుర్తించినట్లు లేదు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ జాన్ బాన్ జోవి ఫొటోను తీసుకొని ఒక తలను మాత్రం మార్ఫింగ్ ద్వారా కమ్రాన్‌గా మార్చారు. పాప్ సింగర్ ఒరిజనల్ ఫొటోతోని పోల్చి చూస్తే ఇది మార్ఫింగ్ ఫొటో అని సులువుగా తెలిసిపోతుంది. జోవి ఎడమ చేతి వాకీటాకీని పట్టుకొని ఉండగా ఆ చేతికి వాచీ కూడా ఉంటుంది. కుడిచేయి నడుము వరకు ఉంటుంది. ఆ రెండు చేతులే కాకుండా ఒంటి మీది ఉన్న దుస్తులు కూడా కమ్రాన్ ఫొటోలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. మార్ఫింగ్‌లో ఫొటో బ్యాక్ గ్రౌండ్‌ను, ఫొటో కలర్ షేడ్‌ను కాస్త మార్చారు.
ఫొటోను మార్ఫింగ్ చేయడానికి ఫొటో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తోపాటు అమెజాన్‌కు చెందిన ‘పోలీస్ సూట్ ఫొటో ఫ్రేమ్ మేకర్’ అనే యాప్‌ను వాడినట్లు స్పష్టం అవుతుంది. ఫొటో మార్ఫింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌లో కమ్రాన్ హతమయ్యాడని సైనిక వర్గాలు ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహం ఫొటోలను విడుదల చేయక పోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment