కాంగ్రెస్ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్' (హిందీ)లో భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను నిందించడం కలకలం రేపింది.
సొంత పార్టీ పత్రికలో.. తమ పార్టీకే చెందిన దివంగత నేత, అది కూడా భారతదేశ తొలి ప్రధాని.. జవహర్‌లాల్ నెహ్రూను నిందించడం కాంగ్రెస్ తలకు చుట్టుకుంది. ఆ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్' (హిందీ)లో భారతదేశ నెహ్రూను నిందిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని ఈ పత్రికలో ప్రచురించిన కథనం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
చైనా, టిబెట్ దేశాలతో విదేశీ వ్యవహారాల విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ.. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ మాటను పెడచెవిన పెట్టారని విమర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల మీద పట్టున్న పటేల్ సలహాలను నెహ్రూ పాటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ దర్శన్ (హిందీ ఎడిషన్) డిసెంబర్ సంచికలో డిసెంబర్ 15న పటేల్ వర్ధంతి సందర్భంగా పటేల్‌కు నివాళులర్పింస్తూ ప్రచురించిన ఈ వ్యాసంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకించారు. చైనాకు అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరిని పటేల్ తప్పుబట్టారని, నేపాల్ విషయంలో కూడా ఆయన ధోరణిని తప్పుబట్టారని వ్యాసంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇండియాకు చైనా పెద్ద శత్రువుగా మారబోతోందని పటేల్ వ్యాఖ్యానించినట్టు తెలిపారు. అలాగే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించారన్నారు. విదేశీ వ్యవహారాల్లో ప్రవీణుడైన పటేల్ సలహాలను పాటించి ఉంటే గోవా పదేళ్ల ముందుగానే స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేదంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ విధేయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానం, హిందూ - ముస్లిం ఐక్యతతో పాటు, అప్పటి ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య ఘర్షణలను విమర్శిస్తూ దాదాపు 6 పేజీల్లో సాగిన ఈ కథనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. పటేల్ ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్నా. ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇరు నేతలు వివిధ సందర్భాల్లో రాజీనామా చేస్తామని బెదిరించారని వ్యాసంలో రాశారు. పటేల్ దూరదృష్టిని నెహ్రూ అంగీకరించి ఉంటే, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనేక సమస్యలు తలెత్తేవి కావని చెప్పారు. అయితే పొరపాటు జరిగిందని, ఇది తనకు తెలిసి జరిగింది కాదని బాధ్యులపై చర్య తీసుకుంటామని ముంబై కాంగ్రెస్ చీఫ్, పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపమ్ ప్రకటించారు.
ఒకవైపు అధికార బీజేపీ ఉక్కుమనిషి పటేల్‌ను కీర్తిస్తూ, నెహ్రూపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో స్వయంగా తమ పార్టీ అధికార పత్రిలో వివాదాస్పద కథనం రావడం సంచలనం రేపింది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.