నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య!
సోనియా తండ్రి ఫాసిస్టు జవాను!
కాంగ్రెస్ పత్రికలో తీవ్ర విమర్శలు
కంటెంట్ ఎడిటర్ తొలగింపు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ‘నెహ్రూ.. పటేల్ మాట వినివుంటే కశ్మీర్ సమస్య, చైనా, పాక్‌తో వివాదాలు ఉండేవి కావు. పటేల్ వారిస్తున్నా వినకుండా ఆయన కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి చేతిలో ఉంచారు.. సోనియా గాంధీ తండ్రి ఫాసిస్టు సైనికుడు. సోనియా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలయ్యారు..’ ఈ తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన బీజేపీనో, మరో పార్టీనో చేసినవి కావు. సాక్షాత్తూ కాంగ్రెస్ అధికార పత్రిక ఉద్ఘాటించినవి. పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునేవేళ కాంగ్రెస్‌ను ఇవి ఊబిలో పడేసి, ముఖాన్ని కందగడ్డలా మార్చాయి.
ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ(ఎంఆర్సీసీ)కి చెందిన హిందీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’ డిసెంబర్ సంచికలో వ్యాసకర్తల పేర్లు లేకుండా వచ్చిన రెండు వ్యాసాల్లో ఈ విమర్శలు ఉన్నాయి. చిత్రంగా ఈ సంచికను సోనియా గాంధీకే అంకితం చేసి కవర్ పేజీపై ఆమె ఫొటో ముద్రించారు. సోనియా కాంగ్రెస్ చీఫ్ అయ్యాక పార్టీకి చేసిన సేవలను, ఆమె సాధించిన విజయాలనూ ప్రస్తావించారు. ఈ వ్యాసాలపై కాంగ్రెస్ అధిష్టానం సోమవారం కన్నెర్రజేసింది. దీంతో పత్రిక ఎడిటర్, ఎంఆర్సీసీ చీఫ్ సంజయ్ నిరుపమ్ క్షమాపణలు చెప్పారు. ఎడిటోరియల్ కంటెంట్ ఇన్చార్జి సుధీర్ జోషీని ఆ పదవి నుంచి తప్పించారు.
తప్పు చేశాను: నిరుపమ్
ఈ వ్యాసాలతో తనకు సంబంధం లేదని తొలుత పేర్కొన్న ఎడిటర్ నిరుపమ్ తర్వాత తప్పు చేసినట్లు అంగీకరించారు. ‘తప్పు ఒప్పుకుంటున్నాను. తప్పు చేసిన సంపాదక విభాగంపై విచారణ జరుపుతాం. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వం’ అని చెప్పారు.
మాకు సంబంధం లేదు: కాంగ్రెస్
‘కాంగ్రెస్ దర్శన్’తో తమకు సంబంధం లేదని, నిరుపమ్‌ను ఆ పత్రిక ఎడిటర్‌గా తాము నియమించలేదని కాంగ్రెస్ పేర్కొంది. ‘అది మూతపడిన పత్రిక. పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఉంది’ అని పార్టీ ప్రతినిధి టోమ్ వడక్కన్ ఢిల్లీలో అన్నారు. నిరుపమ్‌ను ఎంఆర్సీసీగానే నియమించామన్నారు. ఆయన అంతా వ్యక్తిగతంగా చేశారని, పత్రిక ఎడిటోరియల్ కంటెంట్ ఎడిటర్ తొలగింపుతోనూ తమకు సంబంధం లేద ని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, రాజ్ బబ్బర్లు పేర్కొన్నారు. వ్యాసాల్లో వాడిన పదజాలం ఆరెస్సెస్ నిఘంటువు నుంచి తీసుకున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్.. నిరుపమ్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలోని ఆ పత్రిక కార్యాలయం వద్దకు చేరుకుని నిరుపమ్ వెంటనే పార్టీకి, పత్రిక కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుపమ్ క్షమాపణలు చెప్పారని, నిర్ణయాన్ని ఎంఆర్సీసీకి వదిలేయాలని పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ అన్నారు. శివసేనలో ఉన్నప్పుడు సోనియాను విమర్శించిన నిరుపమ్‌కు ఇంకా బుద్ధిరాలేదని ముంబై కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు.
నిరుపమ్‌కు బీజేపీ అభినందనలు
కాంగ్రెస్ ‘సొంత బురద’లో చిక్కుకోవడంతో బీజేపీ సంబరపడిపోయింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. నిరుపమ్‌ను అభినందించారు. ‘కాంగ్రెస్ దర్శన్‌ను ‘సత్యదర్శన్’ అని పిలవాలి. ప్రధాని అయ్యేందుకు పటేల్‌కు కాంగ్రెస్‌లో చాలినంత మద్దతు ఉండేది. అయితే గాంధీజీ పటేల్‌ను పక్కన పెట్టి నెహ్రూ పేరు ప్రతిపాదించారు. పటేల్ 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయగా, నెహ్రూ కేవలం కశ్మీర్‌కు మాత్రమే బాధ్యుడు. అది ఇప్పటికీ సమస్యలా మిగిలింది. ఇది బీజేపీ, నేను అంటున్నమాట కాదు, కాంగ్రెస్ పత్రికే అంది.
కాంగ్రెస్ దాచిపెడుతున్నది బయటికొచ్చింది’ అని ఢిల్లీలో అన్నారు. కాంగ్రెస్ పటేల్ గురించి రాయదని, ఇప్పుడు నిజం చెప్పిందని పేర్కొన్నారు. నిరుపమ్ గతంలో శివసేన పత్రిక ‘దోపహర్కా సామ్నా’ సంపాదకుడిగా ఉన్నప్పుడూ ఇలాంటి వ్యాసాలకు ప్రసిద్ధి అని చెప్పారు. నెహ్రూ-గాంధీయేతర కుటుంబాలకు చెందిన పీవీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి వారికి కాంగ్రెస్ న్యాయం చేయలేదని అన్నారు. పత్రిక కంటెంట్ ఎడిటర్‌ను తొలగించడం వాస్తవాలపై కాంగ్రెస్ అసహన వైఖరికి నిదర్శనమని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. నిరుపమ్ నిజం చెప్పారని, ఆయనను అభినందిస్తున్నామని శివసేన కూడా పేర్కొంది.
నెహ్రూ పెడచెవిన పెట్టారు!
‘కాంగ్రెస్ దర్శన్’లో వచ్చిన రెండు వ్యాసాల్లో ఒకదాంట్లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను విమర్శించారు. తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వర్ధంతి(ఈ నెల 15) సందర్భంగా రాసిన ఈ వ్యాసంలో పటేల్‌ను దార్శనికత గల నేత అని కొనియాడారు. నెహ్రూతో ఆయన విభేదాలను ప్రస్తావించి, పటేల్ మాటలను తొలి ప్రధాని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ‘ఆనాడు పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పరిగణనలోకి తీసుకుని ఉంటే కశ్మీర్, చైనా, టిబెట్, నేపాల్‌కు సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఉండేవి కావు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ ఐరాస ముందుకు తీసుకెళ్లే యత్నాన్ని పటేల్ వ్యతిరేకించారు. పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పట్టించుకోకపోవడంతో ఇద్దరి అనుబంధం తెగే స్థితికి వచ్చింది. పటేల్ ఉప ప్రధాని, హోంమంత్రి అయిన్పటికీ విదేశీ విధానంలో ఆయన ముందుచూపుతో నెహ్రూ ఏకీభవించలేదు. ఒక దశలో పరిస్థితి పటేల్ రాజీనామా చేయాలనుకునేదాకా వెళ్లింది’ అని పేర్కొన్నారు. టిబెట్ విషయంలో చైనాను నమ్మొద్దని, అది భారత్‌కు శత్రువు అవుతుందని 1950లో పటేల్ రాశారంటూ ఓ లేఖను ఉటంకించారు.
62 రోజుల్లోనే అధ్యక్ష పదవి
మరో వ్యాసంలో సోనియా గాంధీ తొలినాళ్ల వ్యక్తిగత జీవితాన్ని వివరించారు. ఆమె ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న విషయాన్ని ఉటంకించారు. ‘సోనియా తండ్రి స్టెఫానో మైనో ఫాసిస్టు సైనికుడు. రెండో ప్రపంచయుద్ధంలో ఓడిన ఇటలీ సైన్యంలో ఆయన పనిచేశారు’ అని తెలిపారు. సోనియా వేగవంతమైన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ..‘ఆమె 1997లో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు విఫలయత్నం చేశారు’ అని విశ్లేషించారు.
ఘనంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత కాసేపు కార్యాలయంలో మాట్లాడుకున్న సోనియా, రాహుల్‌లు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.