ధైర్యవంతురాలు
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంతో ధైర్యవంతురాలని కర్ణాటక పరప్పన అగ్రహార జైలు వర్గాలు కితాబిచ్చాయి. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించాయి. ఆమె దిన చర్య ను అక్కడి జైళ్ల శాఖ డీఐజీ ఎం.జయసింహ మీడియాకు వివరించారు. అమ్మకు బెయిల్ రావాలంటూ పూజలు, యాగాలు జోరందుకున్నాయి.
సాక్షి, చెన్నై:ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. జైలులో ఉన్న జయలలిత అనారోగ్యంతో ఉన్నట్టు, ఆమె ఎవరినీ కలవకుండా తీవ్ర మనోవేదనతో ఉన్నట్టు ప్రచా రం సాగుతోంది. ఇది కాస్త రాష్ట్రంలో ఆందోళనకు దారి తీస్తోంది. ఈ పరిస్థితుల్లో కారాగార వాసంలో జయ మనోధైర్యాన్ని వివరిస్తూ పరప్పన అగ్రహార జైలు వర్గాలు కితాబి చ్చాయి. కారాగార వాసంలో జయలలిత దినచర్యను కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ జయసింహ ఓ తమిళ మీడియాకు వివరించారు. సాధారణంగా జైలుకు వచ్చే వారు తీవ్ర మనోవేదనతో ఉండడం సహజమని తెలిపారు. అలాంటి జాడ జయలలిత ముఖంలో కన్పించడం లేదన్నారు. ఆమె ధైర్యంతో ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు.
జైలు నిబంధనలకు లోబడి వ్యవహరిస్తూ అంద రినీ మర్యాదగా, ఆప్యాయంగా పలకరిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో ఆమెను ఎవరూ సమీపించే ప్రసక్తే లేదన్న విషయం తనకు తెలుసని, ఇక్కడ అన్నింటికీ భిన్నంగా ఆమె అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఆమెను తాను చూడడం ఇదే ప్రథమమని, తనతో మర్యాదపూర్వకంగా ఉంటూ కృతజ్ఞతలు తెలుపుతుంటారని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం ఓ తమిళ పత్రిక, రెండు ఆంగ్ల పత్రికల్ని గంటన్నరలో చదువుతున్నారని తెలిపారు. ఉదయం పాలు, రొట్టె, మధ్యాహ్నం కాస్త పెరుగన్నం, రాత్రి కూడా పెరుగ న్నం లేదా ఆపిల్ తీసుకుంటున్నారని వివరించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అసవరం లేదని స్పష్టం చేశారు. జయలలితతో పాటు శశికళ, ఇలవరసి ఒకే గదిలో ఉన్నారని, అలాగే జయలలితకు సాయంగా ఓ మహిళా అధికారిని నియమించినట్టు పేర్కొన్నారు. సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగినా మర్యాద పూర్వకంగా సమాధానమిస్తున్నారని, జయలలిత నిజంగానే ధైర్యవంతురాలని జయసింహ కితాబు ఇవ్వడం విశేషం.
యాగాలు, పూజలు:
జయలలితకు సుప్రీం కోర్టులో బెయిల్ రావాలని కాంక్షిస్తూ ఆలయాల్లో పూజలు, యాగాలు జోరందుకున్నాయి. షోళింగనల్లూరులోని ప్రతింగారాయ ఆలయంలో ప్రత్యేక యాగం ప్రారంభమైంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రతిరోజూ ఉదయాన్నే అన్నాడీఎంకే వర్గాలు జయలలిత పేరిట పూజలు చేసే పనిలో పడ్డారు. జయలలితను విడుదల చేయాలంటూ నిరసనలు సైతం చేస్తున్నారు. ఉదయం వళ్లువర్ కోట్టం వద్ద నాడర్ల సంఘం నేతృత్వంలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు.
కేసుల మోతకు రెడీ
జయలలిత బెయిల్ మీద బయటకు రావాలని ఆలయాల బాటలో పడిన అన్నాడీఎంకే వర్గాలపై కేసుల మోతకు డీఎంకే సిద్ధమైంది. జయలలితకు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్రంలో సాగిన వీరంగాలు, అరాచకాలను అస్త్రంగా చేసుకుని కేసుల మోతకు ఆ పార్టీ న్యాయవాద విభాగం ఉరకలు తీస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీలో పార్టీ న్యాయవాద విభాగం నాయకులు నీలకంఠం, ముత్తుకుమార్, గణేషన్ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ అన్నాడీఎంకే వర్గాల ఆరాచకాలు సాగాయో, ఆ వివరాలు, ఫొటోలు సహా ఆధారాల్ని ఈ కమిటీకి సమర్పించాలని డీఎంకే శ్రేణులకు ఆ విభాగం నేత ఆర్‌ఎస్ భారతి సూచించారు. లభించే ఆధారాల మేరకు అన్నాడీఎంకే వీరంగాలపై కోర్టుల్లో పిటిషన్ల రూపంలో కేసుల మోత మోగించేందుకు ఆర్‌ఎస్ భారతి కార్యాచరణ సిద్ధం చేయడం ఎలాంటి వివాదాలకు దారి తీయనుందో వేచి చూడాల్సిందే.