సాక్షి, చెన్నై: భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సిద్ధం అయ్యారు. ముందుగా తన సేనల్ని ఢిల్లీకి పంపించారు. పంచె కట్టుతో అలరించే విధంగా కొత్త ఎంపీలు విమానం ఎక్కేశారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గత వారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చినా జయలలిత మాత్రం వెళ్లలేదు. తనకు మోడీ మంచి మిత్రుడైనా, రాజపక్సేకు ఆహ్వానం పంపడాన్ని జయలలిత వ్యతిరేకించారు. ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నా, కేంద్రంతో సామరస్య పూర్వకంగా మెలిగేందుకు సిద్ధమయ్యారు. తన ఎంపీలతో మోడీని కలిసేందుకు జయలలిత నిర్ణయించారు. ఇందుకు పీఎంవో నుంచి అనుమతి లభించడంతో ఢిల్లీ పయనానికి జయలలిత సిద్ధం అయ్యారు.
అమ్మ సేన పయనం: లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయా న్ని తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 37 మంది ఎంపీలుగా ఎన్నికయ్యూరు. వీరిలో అత్యధిక శాతం కొత్త వాళ్లే. కొందరైతే, ఢిల్లీ ముఖం కూడా చూడని వాళ్లు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. తమ అధినేత్రి జయలలిత ఆదేశాలతో సోమవారం ఉదయం నుంచి ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యే పనిలోపడ్డారు. అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత తంబి దురై ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లారు. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సైతం బయలు దేరి వెళ్లారు. కొత్తగా పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్న ఎంపీలతో పాటుగా మిగిలిన వారు పంచె కట్టుతో విమానం ఎక్కేశారు. తమిళ సంప్రదాయాన్ని చాటే రీతిలో అన్నాడీఎంకే చిహ్నంతో కూడిన జరీ అంచు పంచెకట్టుతో, మహిళా ఎంపీలు ఆ పార్టీ జె ండా రంగును తలపించే పట్టు చీరలు ధరించి వెళ్లారు. వీరి కోసం విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. టికెట్లు అందుకున్న ఎంపీలు, తమకు కేటాయించిన విమానాల్లో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అన్నాడీఎంకేకు చె ందిన పది మంది రాజ్యసభ సభ్యులు సైతం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.
మోడీతో నేడు భేటీ: సేనలు ముందుగా వెళ్లి ఢిల్లీలో జయలలితకు ఘన స్వాగతం పలికే ఏర్పాట్లలో పడ్డారు. ఢిల్లీ పార్టీ అధికార ప్రతినిధుల నే తృత్వంలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ముందుగానే ఎంపీలను, పార్టీ సీనియర్లు, మంత్రులతోపాటుగా ముఖ్య నాయకుల్ని ఢిల్లీకి జయలలిత పంపించినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జయలలిత బయలు దేరనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తరువాత ఆమె కాసేపు తమిళనాడు భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తన ఎంపీలతో కలసి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించనున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి అత్యధిక శాతం నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
రాజ్యసభలో మద్దతు : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలగడంతో పాటుగా, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకోవడం, సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు జయలలిత నిర్ణయించినట్టు సమాచారం. పార్లమెంట్‌లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రాజ్యసభలో అన్నాడీఎంకేకు 10 మంది ఎంపీలు ఉన్నారు. ఏదేని కీలక ముసాయిదాలు రాజ్యసభలో ఆమోదం పొందాల్సిన వస్తే, అన్నాడీఎంకే మద్దతు కేంద్రానికి అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం జయలలిత ఆ దిశగా రాజ్య సభలో కేంద్రానికి మద్దతుగా ఉండే రీతిలో తాజాగా జరగనున్న భేటీలో ఒప్పందం కుదిరినా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీకి వెళ్లిన ‘అమ్మ’ సేన!
Published Mon, Jun 2 2014 11:49 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement