ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
అనారోగ్యంతో ఉన్న ఒక ప్రయాణికురాలి కోసం తన సీటును కేంద్ర మంత్రి జయంత్ సిన్హా త్యాగం చేశారు. దాంతో ఎంతగానో ఆనందపడిన ఆమె కూతురు.. 'అచ్ఛేదిన్' అంటే ఇవేనంటూ ట్వీట్ చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. బెంగళూరు నుంచి రాంచీ వెళ్లే ఇండిగో విమానంలో శ్రేయా ప్రదీప్ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే శ్రేయా తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె కాళ్లు చాపుకుని పడుకోవాల్సి వచ్చింది. కానీ, వాళ్లు ప్రయాణించేది ఎకానమీ క్లాస్‌లో కావడంతో అది సాధ్యం కాలేదు. అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. విషయం తెలిసిన ఆయన.. తమ రెండు సీట్లను తల్లీ కూతుళ్లకు ఇచ్చి, తాను భార్యతో సహా ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లారు. దాంతో శ్రేయా తల్లికి కాస్త ఊరట లభించింది.
ఈ విషయాన్ని శ్రేయాప్రదీప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్టును 3,000 మంది రీట్వీట్ చేయగా, 2,900 మంది లైక్ చేశారు. మంత్రి జయంత్ సిన్హాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను కూడా ఆమె ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఆమె ట్విట్టర్ ఖాతా మోతెక్కిపోతూనే ఉంది. పలువురు ఆమెను, మంత్రి జయంత్ సిన్హాను, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విషయం తెలియగానే స్పందించి, సమస్యలను పరిష్కరించడంలో ముందున్నందుకు జయంత్ సిన్హా కూడా మరికొందరు మంత్రులతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందంజలో ఉన్నారు. పెళ్లి గురించిన సలహాల దగ్గర్నుంచి అత్యవసరంగా రైల్లో తమ పిల్లలకు డైపర్లు కావాలని కూడా వాళ్లకు జనాలు ట్వీట్ చేస్తున్నారు. మరోవ్యక్తి తన ఖరీదైన కారు రోడ్డు మధ్యలో ఆగిపోయిందని.. ఆ కంపెనీవాళ్లు సరిగా స్పందించడం లేదని సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు.