
జేఎడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అస్పష్ట తీర్పు వెలువడగానే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ప్రతిపాదించానని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. కుమారస్వామిని సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీయే ఒత్తిడి చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లతో.. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి..తాము మద్దతిస్తామని స్పష్టం చేశానన్నారు. అయితే కుమారస్వామిని కర్ణాటక సీఎం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంగా వారు చెప్పారన్నారు. రైతులకు ఊరట కల్పించే అంశం సహా సంకీర్ణ సర్కార్‌ను నడపడంకష్టమేనని దేవెగౌడ చెప్పుకొచ్చారు.
కేవలం 37 మంది ఎంఎల్‌ఏలతో తాము మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుంటే సర్కార్ సాఫీగా నడవడం సాధ్యం కాదన్నారు. కుమారస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఉంటారని, 6.5 కోట్ల కన్నడిగుల ఆకాంక్షలతో కాదని అన్నారు. పరిస్థితులకు లోబడిన వ్యక్తిగా కుమారస్వామిని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వస్తే రూ 53,000 కోట్ల రైతు రుణాలను 24 గంటల్లో మాఫీ చేస్తానని కుమారస్వామి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంకీర్ణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ హామీ అమలుకు ఆయన మరికొంత సమయం కోరుతున్నారు.