'పటేల్‌కే ఓటేశా.. నితీష్ ఫోన్ చేయలే'
గాంధీనగర్: తాను కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేశానని గుజరాత్ జేడీయూ ఎమ్మెల్యే చోటు వాసవ చెప్పారు. పేద ప్రజలను, గిరిజనులను బీజేపీ చిన్నచూపు చూస్తున్న కారణంగానే తాను తన ఓటును అహ్మద్‌కు వేసినట్లు తెలిపారు. గుజరాత్‌లోని గిరిజనులకు ప్రాతినిధ్యం ఉన్న నియోజవర్గం బారుచ్‌లో వాసవ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల జేడీయూ బీజేపీతో చేతులు కలిపింది. బిహార్ లో బీజేపీ సహాయంతోనే జేడీయూ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యే అయిన వాసవ సహకారం బీజేపీకే ఉంటుందని అనుకున్నారు.
అంతేకాకుండా, ఆయన ఓటింగ్ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీకి ఆయన ఓటు పడకపోవచ్చని భావించారు. అయితే, ఆయన మాత్రం అనూహ్యంగా తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. 'బీజేపీ 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. కానీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు చేసేందేమి లేదు. చేసే సహాయం అరకొరగానే చేస్తుంటుంది. ఓట్ల గురించి నితీష్ కుమార్ నాకు ఫోన్ చేయలేదు. పార్టీ ఎలాంటి విప్ కూడా జారీ చేయలేదు. పటేల్‌కు ఓటు వేయాలన్న నిర్ణయం నేను తీసుకున్నదే' అని ఆయన చెప్పారు.