రాంచీ : నలభై రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాగునీటి కాలువ, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఇరవై నాలుగ్గంటల్లోనే కొట్టుకుపోయింది. దీనికి అధికారులు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎలుకలు పెట్టిన బొరియలు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలు.. నలభై రెండేళ్ల క్రితం ఉమ్మడి బిహార్‌లో హజారిబాగ్ జిల్లాలోని కోనార్ నదిపై ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 కోట్లు. కాలువ పూర్తయ్యేసరికి నాలుగు దశాబ్దాల సమయంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 2176 కోట్లకు చేరింది. ఎట్టకేలకు పూర్తైన కాలువను బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ బుధవారం ప్రారంభించి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు కూడా.
అయితే గురువారం వచ్చిన వరదలకు కాలువ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. వరదల వల్ల 35 గ్రామాలతో పాటు పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సంఘటనపై అధికారులను వివరణ అడగ్గా నివ్వెరపోయే సమాధానం వచ్చింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వడం వల్ల వరద నీరు లీకై కాలువ గట్టు కొట్టుకుపోయిందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని వివరించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment