'ఆ హంతకులతో మాంఝీకి సంబంధాలు'!
పాట్నా: హంతకులతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ సంబంధాలు పెట్టుకున్నాడని జేడీయూ ఆరోపించింది. ఇద్దరు ఇంజినీర్లను హత్య చేసిన రౌడీ షీటర్ల కుటుంబందో మాంఝీ సంబంధాలు నెరిపాడని, ఈ విషయంలో తెరవెనుక ఆయన నేరస్తులను ప్రోత్సహిస్తారని స్పష్టం చేస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ 26న ఇద్దరు ఇంజినీర్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యను బహేరీ బ్లాక్ అనే సంస్థకు చీఫ్ మున్నీ దేవీ, ఆమె భర్త సంజయ్ లాల్ దేవోనే చేయించారని ఆరోపణలు వినిపించాయి.
పైగా మున్నీ దేవీ ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న గ్యాంగ్ స్టర్ సంతోష్ ఝా సోదరి కూడా. హత్య కేసును విచారించిన పోలీసులు ఆ ఆరోపణలే నిజం అన్నట్లుగా తాజాగా నేడు(ఆదివారం) మున్నీ దేవీని, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తాము అనుకున్నట్లే జరిగిందని, నేడు అరెస్టు అయిన ఆ ఇద్దరు దంపతులు కూడా హిందూస్థానీ అవామీ లీగ్ మోర్చా(లౌకిక), బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారని, వారు టికెట్ ఆశించారని, వారి ప్రచార పోస్టర్లలో కూడా పెద్దపెద్ద ఫొటోలతో కనిపించారని మండిపడ్డారు. దీని ప్రకారం మాంఝీ తెర వెనుక నేరస్తులను ప్రోత్సహిస్తారనే విషయం తేటతెల్లం అవుతుందని నీరజ్ కుమార్ అన్నారు.