పోలీసుల ఎదుట లొంగిపోయిన రతన్
న్యూఢిల్లీ: సహ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్(29) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండయ్యాడు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)లో ముఖ్యనేతగా ఉన్న రతన్ ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలను నియమించారు.
అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని ఎంఫిల్ విద్యార్థిని(28) ఫిర్యాదు చేయడంతో అతడు అదృశ్యమయ్యాడు. హాస్టల్ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు ఆమె చెప్పింది. క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న రతన్ ను ఏఐఎస్ఏ బహిష్కరించింది.