జూలై 26... నిజంగా మరువలేని రోజు
జూలై 26... నిజంగా మరువలేని రోజు
Published Fri, Jul 25 2014 11:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
జూలై 26. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున కార్గిల్ విజయం భారత్ కి దక్కింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ లు బాహాబాహీగా పోరాడాయి. భారత భూభాగాన్ని చేజిక్కించుకున్న పాకిస్తాన్ పాచికలు పారకుండా, వెనక్కి తరిమేసింది భారత సైన్యం. కార్గిల్ యుద్ధం గురించి కొన్ని విషయాలుః
యుద్ధం ఎలా మొదలైంది?
మామూలుగా చలికాలం సరిహద్దు సైనిక పోస్టులను ఇరు దేశాల సైనికులూ వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999 శీతాకాలంలో పాకిస్తానీ సైనికులు తమ పోస్టులను వదలలేదు. భారత్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. మిలిటెంట్ల రూపంలో పాకిస్తానీలు చొరబడ్డారు. ఈ విషయం మే నెలలో భారత్ దృష్టికి వచ్చింది. దీంతో కార్గిల్ జిల్లాలోని సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచు పర్వతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు యుద్ధం ప్రారంభించింది.
కార్గిల్ ప్రాముఖ్యం ఏమిటి?
కార్గిల్ లడాఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడాఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్ కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది.
కార్గిల్ యుద్ధం ప్రత్యేకత ఏమిటి?
కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమ యుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. మన సైన్యం కింద ఉంది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టమైనది. ఆ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాం. అదీ దీని ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ ను తరిమి కొట్టాం.
ఈ యుద్ధంలో ఎంత మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు?
ఇందులో 537 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్ లను నష్టపోయాం. ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. పాకిస్తాన్ కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది.
ఈ యుద్ధంలో గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్, మనోజ్ కుమార్ పాండే, కాప్టెన్ విక్రమ్ బాత్రా, సంజయ్ కుమార్, కాప్టన్ అనుజ్ నయ్యర్, మేజర్ రాజేష్ అధికారి, మేజర్ శరవణన్, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాలకు అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించారు.
కార్గిల్ యుద్ధం వల్ల మనం లాభపడ్డామా, నష్టపడ్డామా?
ఈ యుద్ధాన్ని కార్గిల్ కే పరిమితం చేయడం ద్వారా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనం ప్రపంచానికి రుజువు చేయగలిగాం. పాకిస్తాన్ సైన్యం మొదట ఈ యుద్ధంతో తనకు సంబంధం లేదన్నా తరువాత అంగీకరించక తప్పలేదు. దీని వల్ల పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ యుద్ధం తరువాత పాకిస్తాన్ లో ప్రభుత్వమే మారిపోయింది. పాకిస్తాన్ ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది.
Advertisement