నేను మేలిమి బంగారాన్ని...
చెన్నై: న్యాయం గెలిచింది... నిజాలు నిగ్గు దేలి..మేలిమి బంగారంలా బైటపడ్డానని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతోషం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు మరో ముగ్గురిపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
దీంతో దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యర్తలు సంబరాలు చేసుకున్నారు. కర్టాటక హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం కిక్కిరిసిన అభిమానులనుద్దేశించి ఆమె తొలిసారి మాట్లాడారు. న్యాయస్థానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ...కోర్టు తీర్పు తనకు చాలా పూర్తి సంతృప్తి నిచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ శత్రువలు తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాజా తీర్పుతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర భగ్నమైందన్నారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ధర్మమే గెలిచిందన్నారు.
తాను ఏ తప్పు చేయలేదని రుజువైందన్నారు. ఇది తుది తీర్పు కాదని, కోర్టులపైన కోర్టులు ఉంటాయని, అది మనస్సాక్షిగా జయలలిత అభివర్ణించారు. తనకోసం ప్రార్థనలు చేసి ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ట్రయిల్ కోర్టు తీర్పు తరువాత ఆత్మహత్య చేసుకున్న 237 మంది అభిమానులకు సంతాపం తెలిపారు. వాళ్లు కొంచెం సంయమనం పాటించి ఉంటే ఈనాటి సంబరాల్లో పాలు పంచుకునేవారన్నారు.
కాగా అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి జయలలితతో పాటు మరోముగ్గురిని నిర్దోషిగా ప్రకటించారు. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.