జయలలిత నిర్దోషి: హైకోర్టు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఫలితంగా.. ఆమె మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.