ప్రధాన న్యాయమూర్తిపై జస్టిస్ కర్నన్ దూకుడు!
దేశ న్యాయ చరిత్రలోనే ఇదో సంచలనం. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ ఓ పెద్ద దుస్సాహసం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు!! ఈనెల 28వ తేదీన కోల్‌కతాలోని తన రెసిడెన్షియల్ కోర్టుకు రావాలని తెలిపారు. జస్టిస్ కర్నన్ మీద ఇంతకుముందే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, మరో ఆరుగురు న్యాయమూర్తులు కోర్టు ధిక్కార నేరాన్ని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశింఆచరు. అంతేకాదు, జస్టిస్ కర్నన్ మీద బెయిలబుల్ అరెస్టు వారెంటును కూడా ఈ రాజ్యాంగ ధర్మాసనం జారీచేసింది.
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారికి ఏ శిక్ష విధించాలన్న విషయమై అభిప్రాయాలు చెప్పాలని.. అందుకోసం పైన పేర్కొన్న గౌరవనీయులైన ఏడుగురు జడ్జీలు రోజ్‌డేల్‌లోని తన రెసిడెన్షియల్ కోర్టులో తన ఎదుట 28వ తేదీ ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని తాను ఆదేశించినట్లు జస్టిస్ కర్నన్ మీడియాకు తెలిపారు. ఈ సుమోటో జ్యుడీషియల్ ఆర్డర్‌ను తన ఇంటినుంచే జారీచేసినట్లు ఆయన చెప్పారు. కోల్‌కతాలోని రోజ్‌డేల్ నివాసంలో తన తాత్కాలిక కోర్టును ఏర్పాటుచేసుకున్నానన్నారు. ఆ ఏడుగురు న్యాయమూర్తులు దురుద్దేశంతో తనను కావాలనే అవమానించారని, కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించారని ఆయన చెప్పారు.
ఈ ఏడుగురు న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులని తాను మార్చి 31వ తేదీనే ఒక తీర్పు చెప్పానని జస్టిస్ కర్నన్ న్నారు. కాగా, కర్నన్ మానసిక స్థితి ఎలా ఉందో అనే అనుమానాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ వ్యక్తం చేశారు. ధర్మాసనంలోని మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు కూడా దాన్ని నిర్ధారించారు. ఈ ప్రశ్నను బహిరంగ కోర్టులో లేవనెత్తడం ద్వారా వారు తనను అవమానించారని ఇప్పుడు కర్నన్ అంటున్నారు. బహిరంగ కోర్టులో ఇది తనకు చాలా పెద్ద అవమానమని ఆయన అన్నారు.