నన్ను జైలుకు పంపండి: జడ్జి
తన పని వెంటనే మళ్లీ తనకు ఇప్పించాలని, లేని పక్షంలో తాను మళ్లీ మరోసారి కోర్టుకు హాజరయ్యేది లేదని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ స్పష్టం చేశారు. కావాలంటే తనను జైలుకు పంపాలని కూడా చెప్పారు. సుప్రీంకోర్టును కూడా లెక్క చేసేది లేదని.. కోర్టు ధిక్కార కేసు విచారణను తాను ఎదుర్కోబోనని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ మొండికేయడంతో సుప్రీంకోర్టు ఆయనపై గతంలో బెయిలబుల్ అరెస్టు వారంటు జారీచేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట శుక్రవారం హాజరయ్యారు. తన పాలనాపరమైన, న్యాయపరమైన పనిని ఫిబ్రవరి నెలలో ఏకపక్షంగా లాగేసుకున్నందున దాన్ని వెంటనే పునరుద్ధరించాలని జస్టిస్ కర్నన్ ధర్మాసనాన్ని కోరారు.
తాను ఉగ్రవాదిని గానీ, అసాంఘిక శక్తిని గానీ కానని, అంతగా కావాలనుకుంటే ధర్మాసనం తనను జైలుకు కూడా పంపుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట జస్టిస్ కర్నన్ (61) వాదించారు. అయితే, ఆయనకు కలకత్తా హైకోర్టులో మళ్లీ విధులు అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం సమర్పించాలని ఆదేశించింది. ఆయన మానసిక స్థఙతి ఏమీ బాగోలేదని, అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, అలాంటిదేమీ లేదని.. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు స్పష్టంగా తెలుస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. 20 మంది జడ్జీలపై చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారా, లేదా ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణలు చెబుతారో చెప్పాలని సుప్రీంకోర్టు జస్టిస్ కర్నన్‌ను అడిగింది. తాను చేసిన ఫిర్యాదు చట్టానికి లోబడే ఉందని ఆయన అన్నారు. దాంతో జడ్జి అయినా కూడా ఆయనకు విధివిధానాలు తెలియవని కోర్టు వ్యాఖ్యానించింది.