హైకోర్టు జడ్జిపై కోర్టు ధిక్కార చర్యలు!
హైకోర్టు జడ్జిపై కోర్టు ధిక్కార చర్యలు!
Published Wed, Feb 8 2017 9:50 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
దేశ న్యాయవ్యవస్థలోనే ఇంతవరకు ఎన్నడూ జరగని ఘటన ఒకటి జరిగింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేసినందుకు కలకత్తా హైకోర్టు సిటింగ్ జడ్జి జస్టిస్ సిఎస్ కర్నన్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నిర్ణయించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించనుంది.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిటింగ్ జడ్జిపై కోర్టు ధిక్కార విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కూడా కొంతమంది సిటింగ్ జడ్జిలపై ఆరోపణలు వచ్చినా, వాళ్ల తొలగింపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటుకు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కె. కౌల్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటానని చెప్పి జస్టిస్ కర్నన్ 2015లో మద్రాస్ హైకోర్టును పెను సంక్షోభంలోకి నెట్టేశారు. జస్టిస్ కౌల్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని తాజాగా కొలీజియం సూచించింది. మరో న్యాయమూర్తి విద్యార్హతల విషయంలో సీబీఐ విచారణ కోరారని, తన పనిలో కౌల్ అడ్డుపడుతున్నారని కర్నన్ ఆరోపించారు. తాను దళితుడిని కాబట్టి కులవివక్ష చూపుతున్నారని, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను వేధిస్తున్నారని కూడా ఆరోపించారు. ఆ తర్వాత తనను బదిలీ చేయగా, సుప్రీం ఉత్తర్వులపై కర్నన్ స్టే విధించారు.
Advertisement
Advertisement