సహకరించండి | letter from west bengal dgp to tamil nadu dgp about justice karnan | Sakshi
Sakshi News home page

సహకరించండి

Published Tue, Jun 13 2017 8:55 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

సహకరించండి - Sakshi

సహకరించండి

► జస్టిస్‌ కర్ణన్‌ ‘కానవిల్లై’
► పశ్చిమ బెంగాల్‌ డీజీపీ లేఖ
► అజ్ఞాతంలోనే ఉద్యోగ విరమణ


కోర్టు ధిక్కారం కేసులో ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ కనుమరుగై నెలరోజులు దాటినా ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. కర్ణన్‌ అచూకీ కోసం పడరానిపాట్లు పడుతున్నామని తమిళనాడు పోలీసులు ఆయాసపడుతుండగా, సరైన సహకారం అందలేదని పశ్చిమ బెంగాల్‌ డీజీపీ పరోక్షంగా ఆక్షేపించారు. చెన్నైలో ఉన్న కర్ణన్‌ అరెస్ట్‌కు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కుç పశ్చిమ బెంగాల్‌ డీజీపీ రాసిన ఉత్తరం సోమవారం అందింది.
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహ న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా జస్టిస్‌ కర్ణన్‌ సుప్రీంకోర్టు అగ్రహానికి గురై కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కోల్‌కతాలో సైతం వివాదాస్పద వైఖరిని కొనసాగించారు. తన తోటి న్యాయమూర్తులకే విరోధిగా మారడమేగాక వారికి శిక్షలు విధించేందుకు సిద్ధం కావడంతో కర్ణన్‌ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకుంది. కర్ణన్‌ మానసిక స్థితిపై పరీక్షలు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్యులు ఆయన ఇంటికి వెళ్లగా నిరాకరించారు.

అంతేగాక మానసిక పరీక్షలు చేయాలని ఉత్తర్వులు జారీచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్‌ తీవ్రంగా విమర్శించడంతో గత నెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్‌ను అరెస్ట్‌ చేసే బాధ్యతను కోల్‌కతా పోలీసులకు సుప్రీంకోర్టు అప్పగించింది. ముందుగానే సమాచారం అందుకున్న కర్ణన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసేలోగా కోల్‌కతా నుంచి చెన్నై చేరుకున్నారు. చేపాక్‌ ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్‌ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని కర్ణన్‌ అరెస్ట్‌కు సహకరించాల్సిందిగా చెన్నై పోలీస్‌ కమిషనర్‌ను కోరారు. అయితే చెన్నైకి చేరుకున్న రోజు అర్ధరాత్రి అధికారికి బందోబస్తును, ప్రొటోకాల్‌ కారును అతిథిగృహంలోనే ఉంచి ప్రయివేటు కారులో కర్ణన్‌ వెళ్లిపోయారు.

బందోబస్తు పోలీసులు, ప్రభుత్వ కారు చేపాక్‌ అతిథిగృహం ముందే ఉండడంతో పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఆయన లోపలే ఉన్నారని భావించారు. అయితే తెల్లవారుతున్న సమయంలో అనుమానం వచ్చి ఆరాతీయగా ఆయన రూములో కొందరు న్యాయవాదులు మాత్రమే దర్శనమివ్వడంతో విస్తుపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళుతున్నట్లు తన స్నేహితునికి సమాచారం ఇచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి పరుగులు పెట్టారు. అయితే శ్రీకాళహస్తిలో ఆయన చిక్కలేదు. మరికొందరి సమాచారం మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్గంలో దారికాచారు. అయినా ఆయన దొరకలేదు. కర్ణన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సైతం నిఘా పెట్టారు.

కర్ణన్‌ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఈ నెల 11వ తేదీన కర్ణన్‌ చెన్నై నుంచే అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. కర్ణన్‌ ఎక్కడికీ పారిపోలేదు,  చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసిన ఆయన తరఫు న్యాయవాదులు స్పష్టం చేసినా ఎక్కడ ఉన్నది బహిర్గతం చేయలేదు. కర్ణన్‌ను అరెస్ట్‌ చేసి, వెంటనే వెళ్లిపోవచ్చనే నమ్మకంతో చెన్నై వచ్చిన పశ్చిమ బెంగాల్‌ పోలీసులు మరికొన్నిరోజులు గడపక తప్పదని నిర్ధారించుకుని చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్‌ మెస్‌లో బస చేశారు.

చెన్నై చూలైమేడులో కర్ణన్‌కు ఇల్లు ఉందని తెలుసుకుని అకస్మాత్తుగా దాడి చేసినా ఆయన అక్కడా దొరకలేదు. ఇదిలా ఉండగా, ఆరునెలల జైలు శిక్ష రద్దు కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు నిబంధనలకు లోబడి రిజిస్ట్రారు ద్వారా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలేదని స్వీకరణకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. కర్ణన్‌ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ విచారణకు రాక ముందే అరెస్ట్‌ చేయాలని పట్టుదలతో ఉన్న పశ్చిమ బెంగాల్‌ పోలీసులు చెన్నై పోలీసుల సహాయంతో విస్తృతంగా గాలిస్తూనే ఉన్నారు.

రిటైరైన జస్టిస్‌: ఆరునెలల జైలు శిక్ష నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉండగానే జస్టిస్‌ కర్ణన్‌ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు.
డీజీపీ ఉత్తరం: జస్టిస్‌ కర్ణన్‌ను అరెస్ట్‌ చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ డీజీపీ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌ను కోరారు. కర్ణన్‌ తమిళనాడులోనే తలదాచుకుని ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం చెన్నైతోపాటూ తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో కర్ణన్‌ కోసం తమ పోలీసులు గాలిస్తూనే ఉన్నారని అన్నారు. కర్ణన్‌ చెన్నైలోనే ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నందున ఆయనను అరెస్ట్‌ చేసేందుకు తగిన సహకారం అందిచాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ డీజీపీ విజ్ఞప్తి చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement