
హామీల ఎగవేతకు బాబు ప్రయత్నం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ఎగవేతకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దొడ్డిదారులు వెతుకుతున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ఎగవేతకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దొడ్డిదారులు వెతుకుతున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.ఒక ఉత్పాదక వ్యయంగా ఖర్చు పెట్టాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు గానీ, వయో వృద్ధులను ఆదుకోవడం కోసం ఇచ్చే పెన్షన్ల విషయంలో గానీ ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని దుయ్యబట్టారు.
సీనియర్ మంత్రులను కూడా పక్కన పెట్టి చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ‘‘పెన్షన్ల కోసం రూ. 2,882 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ. 1,338 కోట్లు కేటాయించారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ. 4,300 కోట్లు అవసరం కాగా 2040 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆహార సబ్సిడీకి రూ. 4,173 కోట్లు అవసరం కాగా కేవలం రూ. 2,318 కోట్లు కేటాయించారు. ఇది వృద్ధులు, విద్యార్థులు, పేదలకు మొండిచేయి చూపించే ప్రయత్నమే ’’ అని నె్రహూ దుయ్యబట్టారు.