తమిళనాడుకు కావేరి నదీ జలాలను వదలకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నీళ్లు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై...
తీర్మానానికి ఉభయ సభల్లో ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి నదీ జలాలను వదలకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నీళ్లు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు కర్ణాటక శాసనసభ, మండళ్లు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. జలాలను వదలకూడద ని ఏకగ్రీవంగా తీర్మానించాయి. దీంతో తమిళనాడుకు కావేరి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోనుంది. 2016-17 జల ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున తమ రాష్ట్రంలోనూ తాగునీటి అవసరాలకు మాత్రమే కావేరి నదీ జలాలను వాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని కబిని, కేఆర్‌ఎస్, హారంగి, హేమావతి జలాశయాల్లో కలిపి 27.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి.
తమిళనాడుకు నీటిని విడుదల చేయడం వల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి పరిహారం అందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని శాసనసభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు, మండ్య, మైసూరుల్లో శుక్రవారం కూడా చిన్నపాటి నిరసన కార్యక్రమాలు జరిగాయి.