
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్న పి. అనిల్ కుమార్(ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : ఒకప్పుడు చాయ్‌వాలా.. కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్న ధనిక స్వతంత్ర అభ్యర్థి. పి. అనిల్ కుమార్.. కృషి, పట్టుదల ఉన్న వ్యక్తి. ఆయనకు అదృష్టం కూడా తోడైంది. అందుకే చాయ్‌వాలాగా జీవితం ప్రారంభించిన ఆయన నేడు కోట్లకు అధిపతి అయ్యారు. వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుస్తున్న అనిల్ కుమార్ ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. 339 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడంతో ధనిక స్వతంత్ర అభ్యర్థిగా రికార్డుకెక్కారు. బొమ్మనహళ్లి నియెజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. దేవుడి దీవెనలు, ప్రజల అండదండలతో బీజేపీ అభ్యర్థి సతీశ్ రెడ్డిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
చాయ్‌వాలా నుంచి బిలియనీర్‌దాకా..
కేరళకు చెందిన అనిల్ కుమార్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబంతో సహా బెంగళూరుకు వచ్చారు. తనతోపాటు తన తోబుట్టువులను పోషించేందుకు తల్లి ఎంతో కష్టపడిందని అనిల్ కుమార్ తెలిపారు. పనిచేసినందుకు ఆమెకు నాలుగు ఇడ్లీలు పెట్టేవారని.. వాటిని తినకుండా తమ కోసం తీసుకువచ్చేదని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నతనంలో ఎన్నోసార్లు ఫుట్‌పాత్ మీదే పడుకునే వాడినని.. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి తనను చూసి ఆయన కొట్టులో పని ఇప్పించాడని గుర్తుచేసుకున్నాడు. తర్వాత చిన్న టీ స్టాల్ పెట్టానని, ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న కాలంలోనే తన వ్యాపారం కూడా వృద్ధి చెందిందని తెలిపారు. అలా సంపాదించిన డబ్బుతో చిన్న ప్లాట్ కొని అధిక ధరకు అమ్మడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టానని, తన విజయ ప్రస్థానాన్ని అనిల్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తన కంపెనీ ఎమ్ జే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధిక టర్నోవర్ సాధిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.