ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన చట్టంతో వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో గుజరాత్ మాదిరిగా కన్నడనాట కూడా చలాన్లను సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బీఎస్ యడియూరప్ప బుధవారం ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. తగ్గింపునకు సంబంధించి అధికారులతో చర్చించి సీఎం చేసిన ఆదేశాలను గట్టిగా పరిశీలిస్తున్నట్లు డీసీఎం, రవాణా శాఖమంత్రి లక్ష్మణ సవది తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌లో మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చి జరిమానాలను సగం వరకూ తగ్గించారు. దీంతో వాహనదారులకు కొంతైనా ఊరట దక్కింది. రాష్ట్రంలో కూడా చలాన్ల బాదుడుపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ మాదిరిగా వ్యవహరించాలని సంకల్పించింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో పేర్కొన్నారు.
2 రోజుల్లో నివేదిక
ఇతర రాష్ట్రాలలో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్ణాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తరువాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జరిమానాల విధానంపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు డీసీఎం లక్ష్మణ సవది తెలిపారు. బెంగళూరులో కొత్త ట్రాఫిక్ జరిమానాలపై ఆవేదన వ్యక్తమవుతోంది. గుజరాత్‌లో హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యికి బదులు రూ.500, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే రూ.500 జరిమానాగా వసూలు చేస్తున్నారు. త్రిబుల్ రైడ్‌కు కేంద్రం వేయి రూపాయిల జరిమానాను విధించగా గుజరాత్ ప్రభుత్వం నూరు రూపాయలను వసూలు చేస్తోంది.ఇదే విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. గుజరాత్‌లో మొదటి సారి సగమే విధించినా రెండోసారి అవే ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్రం విధించిన జరిమానాలను వసూలు చేస్తున్నారని కర్ణాటక అధికారుల బృందం చేసిన సర్వేలో తెలింది. ఎలాంటి విధానం అవలంబించాలన్న దానిపై పూర్తి నివేదిక వచ్చాక చర్చించి వారం నుండి తగ్గింపు జరిమానాలను అమలు చేసే అవకాశం ఉంది.
జరిమానాల వసూలుపై సీఎం ఆరా
రాష్ట్రంలో ఇప్పటివరకు వసూలైన కొత్త జరిమానాల వివరాలను సీఎం యడియూరప్ప అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల్లో కోటి రూపాయిల వరకు జరిమానాలు వసూలు చేసిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఐదు వందలకు మించి వసూలు చేస్తే ప్రజలపై భారం పడటంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అధికారులు వివరించినట్లు తెలిసింది.
చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు
Comments
Please login to add a commentAdd a comment