
బెంగళూరు : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. భార్య భర్తలు 24 గంటలు ఇంట్లోనే ఉండడంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భర్తలు పెట్టే హింసలు భరించలేక చాలా మంది మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. తన భర్త స్నానం చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ జయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానం చేయకపోవడంతో అతని నుంచి దుర్వాసన వస్తుందని, అలాగే తన గదిలోనే నిద్రించాలని బలవంతం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి కిరాణ షాపు తెరవకుండా ఇంటి దగ్గరే ఉంటూ హింసిస్తున్నాడని వాపోయారు. అంతే కాదు తండ్రిని చూసి తొమ్మిదేళ్ల కూతురు కూడా వారం రోజులుగా స్నానం చేయడం లేదని ఆమె పోలీసులకు వివరించారు. వ్యక్తి గత శుభ్రత గురించి ఎంత వివరించినా ఆయన పాటించడం లేదని, పైగా గదిలోకి వెళ్లకపోవడంతో తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతన్ని పిలిపించి వ్యక్తిగత శుభ్రత గురించి కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment